
జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ దగ్గర వెళ్తున్న ట్రక్‌ను గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో లారీ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంతో రైలు ఇంజన్ పూర్తిగా ధ్వంసమయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో లోక్ పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సిగ్నల్ లేనప్పటికి రైల్వే క్రాసింగ్ దగ్గరకు ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
జార్ఖండ్‌లోని జాసిదిహ్-మధుపూర్ రైల్వే లైన్‌లో గురువారం (జనవరి 22) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రోహిణి-నవాడిహ్ రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది గోండా నుండి అసన్సోల్‌కు డౌన్ లైన్‌లో వెళ్తున్న రైలు నంబర్ 13510 గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ బియ్యంతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢీకొన్న ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో రైల్వే ట్రాక్‌ల చుట్టూ కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే, భద్రతా కారణాల దృష్ట్యా డౌన్ లైన్ – అప్ లైన్ రెండింటిలోనూ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
झारखंड के जसीडीह में क्रॉसिंग पर ट्रेन ने ट्रक को मारी टक्कर 👇#trainaccident #JharkhandNews pic.twitter.com/kvX1Q89pon
— Vinay Saxena (@vinaysaxenaj) January 22, 2026
రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రైలు రాకపోకలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఆ తర్వాత, పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత, అసన్సోల్-ఝాజా ప్యాసింజర్ రైలును సురక్షితంగా ప్రయాణించడానికి అనుమతించారు. ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రైల్వే, స్థానిక అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.