
నోటితో ఔనని.. చేతలతో కాదని చెప్పే రకం పాకిస్తాన్. కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటలకే తన వక్రబుద్ది చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మనపై దాడులకు తెగబడింది. కానీ పాక్ బుద్ది బాగా తెలిసిన భారత ఆర్మీ.. ఏమాత్రం దానికి చాన్స్ ఇవ్వలేదు. దాయాది కుట్రలను భగ్నం చేస్తూ.. ఎల్‌వోసీ వెంబడి 24 గంట పాటు కాపు కాస్తోంది.
సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. గత కొన్ని రోజులుగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనలకు తెగబడి భారత గ్రామాలపై మోర్టార్ దాడులు చేసింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి, కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో పాక్ ఆర్మీ ఫిరంగులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం వెంటనే స్పందించి పాక్ దాడులకు తగిన రీతిలో బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ పాక్ ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో పాక్ ఆర్మీ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది.
మరోవైపు భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించాయి. అయితే, ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రి సమయంలో భారత సరిహద్దు గ్రామాలపై మళ్లీ కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీ డ్రోన్లు, మిస్సైళ్లను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను కూల్చివేసి పాక్ పన్నాగాన్ని భగ్నం చేసింది.
పాక్ తీరును ఎండగడుతూ.. హెచ్చరికలు పంపింది భారత్. పాకిస్తాన్ ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంక్ పాక్ తీరు దేశాల మధ్య శాంతిని భంగపరిచేలా ఉందని మండిపడ్డారు. భారత సైన్యం పాక్ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. సరిహద్దుల్లో ఏ చిన్న కదలిక జరిగినా గుర్తించేందుకు అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, డ్రోన్లను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్ వైఖరి మారినట్లు కనిపిస్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం చాన్స్ తీసుకునేందుకు సిద్ధం లేదు. సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు భద్రత కల్పించేందుకు అదనపు బలగాలను మోహరించింది. సైనికులు రాత్రిపూట కూడా గస్తీ కొనసాగిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నిశ్శబ్దం నెలకొన్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, పాకిస్తాన్ చర్యలకు తగిన సమాధానం ఇచ్చేందుకు వెనుకాడబోదని స్పష్టం చేసింది.
సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ తన భూభాగ సమగ్రత విషయంలో రాజీ పడదు. ఈ ఉద్రిక్తతల నడుమ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జీవనం సాధారణ స్థితికి చేరేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..