Viral News: జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంతో సరదాగా గడపాలని కోరుకునేది బాల్యం. అమాయకత్వం, కల్లాకపటం తెలియని బాల్యం అందరికి మధురమే.. అయితే ఎప్పుడు ఎలా ఎవరి జీవితం మారుతుందో ఎవరికి తెలుసు. ఓ బాలుడు జీవితంలో కూడా అనుకోని సంఘటన జరిగింది. దీంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఆ బాలుడి పుట్టిన రోజు వేడుకలను ఆ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు అందరూ కలిసి.. వెంటిలేటర్ పైనే బాలుడుతో కేక్ కట్ చేయించి ఆ బాలుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఈ ఘటన జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాంఝీకి చెందిన 13 ఏళ్ల బాలుడు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స జరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా చిన్నారి ఆరోగ్యం విషమించడంతో ఐసీసీయూలో వెంటిలేటర్‌లో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆ చిన్నారి తన పుట్టినరోజు జూన్ 22న అని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఉదయం నుండి.. ఆ పిల్లవాడు తన పుట్టినరోజు జరుపుకోవాలని కుటుంబ సభ్యులను పట్టుబట్టడం ప్రారంభించినప్పుడు. పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డకు ప్రతి ఆనందాన్ని అందించాలని కోరుకుంటారు. ప్రాణాల కోసం పోరాడుతున్న తమ పిల్లాడు కోరుకున్న విధంగా పుట్టిన రోజు వేడుకలను జరిపించాలని ఆ తల్లిదండ్రులకు కూడా ఉంది. అయితే వెంటిలేటర్ పై ఉన్న ఆ పిల్లవాడి కోరికను తీర్చడానికి దేవదూతలా వచ్చారు.. ఆస్పత్రి సిబ్బంది.
చిన్నారి పుట్టినరోజు కోరిక నెరవేర్చిన ఆసుపత్రి సిబ్బంది..
బాలుడికి మెడిసిన్స్ ఇచ్చేందుకు స్టాఫ్ నర్సు వెళ్లిన సమయంలో ఆ బాలుడు.. మెడిసిన్స్ వేసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాదు.. తన పుట్టినరోజు జరుపుకోవాలని పట్టుబట్టాడు. ఈ విషయాన్ని నర్సులు.. వైద్యులకు తెలిపారు. వైద్యులు అక్కడికి చేరుకుని ఆ బాలుడికి పరిస్థితి వివరించినా.. ఆ చిన్నారి తన కోరికను విచిపెట్టలేదు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ శైలేంద్ర రాజ్‌పుత్.. చిన్నారి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోరికను తీర్చాలనుకున్నారు. వెంటనే చిన్నారి గది మొత్తాన్ని అలంకరించి, కేక్ తీసుకుని వచ్చారు. వెంటిలేటర్‌పైనే కేక్ కట్ చేయించి చిన్నారికి సంతోషాన్ని ఇచ్చారు.
ఒకరి తర్వాత ఒకరు నర్సులు, వైద్యులు ఆ బాలుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారి తల్లితండ్రులు కళ్లు చెమర్చాయి. అయితే ఇంటికి ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తారు.. అని ఆ చిన్నారి తన తల్లిదండ్రులను పదే పదే అడిగేది. అప్పుడు తమ పిల్లాడికి సమాధానం చెప్పడానికి వారి వద్ద పదాలు లేవు.
ఆసుపత్రి వైద్యుడు శైలేంద్ర సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. బాలుడు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. పరీక్ష చేయగా బాలుడు కిడ్నీలు రెండూ పాడైపోయాయని తేలింది. గత మూడు నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. డయాలసిస్ జరుగుతోంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారికి గుండెలో కూడా సమస్య ఉందని వైద్యులు తెలిపారు. దాదాపు నాలుగైదు నెలలుగా బాలుడికి చికిత్సను ఇస్తున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..