మరో కొత్త ఏడాది అందరినీ పలకరించింది. 2023కి గుడ్‌బై చెబుతూ.. 2024కి ప్రజలంతా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అర్థరాత్రి వరకు న్యూ ఇయర్ జోష్‌లో మునిగిపోయారు. ఇక ప్రపచమంతా ధూమ్‌ధామ్ అంటూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోగా, ఇస్రో కొత్తేడాదిని కొత్త ప్రయోగంతో మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
సోమవారం (జనవరి 1వ తేదీ) ఉదయం 9.10 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్‌టీ నుంచి ప్రయోగ వేదికకు ఇప్పటికే అనుసంధానం చేశారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం 8.10 గంలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఇది 60వ ప్రయోగం. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్ చేయనుంది.. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.
ఇక పీఎస్‌ఎల్‌వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు ఉంటుంది. అలాగే ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఇదిలా ఉంటే పీఎస్‌ఎల్‌వీ సీ 58 లాంచింగ్ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్ నమూనా చిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆదివారం చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..