New Delhi: అవిశ్వాసం.. ప్రతిపక్షాల వ్యూహమా? లేక అధికారపక్షానికి సువర్ణావకాశమా? చరిత్ర ఏం చెబుతోంది?

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి సంధించిన అవిశ్వాస తీర్మానం సఫలం కాదని వారికి తెలుసు. ప్రభుత్వాన్ని ఓడించే సంఖ్యాబలం లోక్‌సభలో వారికి లేదు. పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం.. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సొంతంగానే 301 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది.

New Delhi: అవిశ్వాసం.. ప్రతిపక్షాల వ్యూహమా? లేక అధికారపక్షానికి సువర్ణావకాశమా? చరిత్ర ఏం చెబుతోంది?
No Confidence Motion on NDA Govt

Edited By: Shiva Prajapati

Updated on: Jul 27, 2023 | 4:22 PM

న్యూఢిల్లీ, జులై 27: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి సంధించిన అవిశ్వాస తీర్మానం సఫలం కాదని వారికి తెలుసు. ప్రభుత్వాన్ని ఓడించే సంఖ్యాబలం లోక్‌సభలో వారికి లేదు. పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం.. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సొంతంగానే 301 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. అవిశ్వాస తీర్మానం లక్ష్యమే అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించడం. సంఖ్యాబలం ప్రకారం ఇది సాధ్యం కాదని తెలిసినా విపక్షాలు ఎందుకు ఈ అస్త్రాన్ని సంధించాయి? మణిపూర్‌ హింసాకాండ, గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు ఈ అస్త్రం ద్వారా సభలో చర్చించవచ్చని భావిస్తున్నాయా? ఇది విపక్ష ‘ఇండియా’ కూటమి వ్యూహాత్మక ఎత్తుగడగా భావించాలా లేక పప్పులో కాలేశారని భావించాలా? చరిత్ర పేజీల్లోకి ఒకసారి తొంగిచూస్తే గతానుభవాలు ఏం చెబుతున్నాయి?

నెహ్రూకూ తప్పలేదు..

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి అవిశ్వాస తీర్మానం 1963లో ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో జరిగిన చైనా యుద్ధం అనంతరం ఆ దేశంతో అవలంబిస్తున్న విదేశీ విధానంపై ఈ తీర్మానం ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల పాటు చర్చ జరిగింది. మొత్తం 21 గంటల 33 నిమిషాల చర్చా సమయం అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 62 ఓట్లు మాత్రమే వచ్చాయి. 347 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో మొదటి తీర్మానం వీగిపోయింది.

నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ తన 16 ఏళ్ల పదవీకాలంలో ఏకంగా 15 పర్యాయాలు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. అందులో ఒకటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టారు.

దేశ ప్రధాన మంత్రులుగా పనిచేసినవారిలో చాలా మంది అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహా రావు తమ హయాంలో మూడేసి పర్యాయాలు అవిశ్వాసాన్ని ఎదుర్కోగా.. మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి రెండేసి పర్యాయాలు ఈ తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ తమ హయాంలో ఒక్కొక్క సారి మాత్రమే అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. తక్కువ సమయం ప్రధాన మంత్రిగా ఉన్న చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ మాత్రం ఒక్కసారి కూడా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోలేదు.

ప్రభుత్వాల పతనం..

అవిశ్వాస తీర్మానం లక్ష్యమే ప్రభుత్వాన్ని పడగొట్టడం. నెహ్రూ, ఇందిర హయాంలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం నెగ్గకపోవడంతో ఆ ప్రభుత్వాలు పడిపోలేదు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం రెండు పర్యాయాలు అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. తొలి తీర్మానం వీగిపోగా, రెండో తీర్మానంపై చర్చ అసంపూర్తిగా ముగిసింది. ఓటింగ్ వరకు వెళ్లలేదు. కానీ 1979 జులై 15న నాటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి తన రాజీనామాను అందజేశారు. నేరుగా తీర్మానంపై ఓటింగ్ కారణంగా ప్రభుత్వం పడిపోకున్నా.. పరోక్షంగా ప్రభుత్వ పతనానికి ఆ తీర్మానం కారణమైంది.

పీవీ నరసింహారావు హయాంలో 1993లో ఆయన ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కినప్పటికీ అందుకోసం జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సభ్యులకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.

కానీ అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో ఎదుర్కొన్న బల నిరూపణ పరీక్షలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కూలిపోయింది. అది అవిశ్వాస తీర్మానం కానప్పటికీ సభలో ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వాస పరీక్షను ఎదుర్కొని ఓడిపోయారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని సమకూర్చుకోలేకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

మోదీపై అవిశ్వాసం నేర్పిన పాఠమేంటి?

ప్రధానిగా మోదీ మొదటి విడతలో 2018లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే రాగా, వ్యతిరేకంగా 325 మంది ఓటేశారు. అలా ఆ తీర్మానం వీగిపోయింది. అయితే ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో మోదీ సర్కారు గతం కంటే ఎక్కువ బలాన్ని పొందింది. ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం తమకు లభించిన సువర్ణావకాశం అని అధికారపక్షం చెబుతోంది. సభలో సంఖ్యాబలం విషయంలో ఢోకా లేదు. అయితే చర్చకు కేటాయించే సమయంలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు సమయాన్ని కేటాయిస్తారు. ఆ ప్రకారం ఎక్కువ సమయం బీజేపీ సభ్యులు మాట్లాడేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా ఎక్కువ ఆస్కారం లభిస్తుంది. గత 9 ఏళ్ల పాలనలో మోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం, దేశంలో రహదారులు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు వంటి రవాణా మౌలిక వసతుల కల్పన సహా తాము చేపట్టిన అన్ని కార్యక్రమాల గురించి చాటుకునే అవకాశం లభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రకంగా చూస్తే అవిశ్వాసం తమకు సువర్ణావకాశం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం 2018లో అవిశ్వాసం తర్వాత తమ సొంత బలం 303కు పెరిగిందని, ఇప్పుడు పెట్టిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఈసారి తమ సొంత బలం 350కు చేరుకుంటుందని అన్నారు.

ప్రతిపక్షాలు గట్టిగా పట్టుపడుతున్న అంశం మణిపూర్ హింసపై చర్చ. ఆ చర్చకు సిద్ధమేనని అధికార పక్షం చెబుతూనే ఉంది. అయితే ప్రధాన మంత్రి సభలో ప్రకటన చేయాలని మరో డిమాండ్ పెట్టారు. ప్రభుత్వం చెబుతున్న చర్చకు ప్రతిపక్షాలు ఒప్పుకుని ఉంటే అది స్వల్పకాలిక చర్చ అయ్యేది. కాస్త వివరంగా, ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం కోసమైతే అవిశ్వాస తీర్మానం అనేది సరైన ఆలోచనే. చర్చ అనంతరం తీర్మానంపై ఓటింగ్ వీగిపోతుందని తెలిసినప్పటికీ.. చర్చ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎండగట్టవచ్చన్న వ్యూహం ప్రతిపక్షాలది. దానికి తగ్గ ప్రతివ్యూహంతో అధికారపక్షం కూడా సిద్ధమవుతోంది. మొత్తంగా ఇది ఎవరికి అనుకూలం అన్నది చర్చ తర్వాతే తేలుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..