వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో తాము జరుపుతున్న చర్చలకు ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతోందని, చర్చలు ఫలప్రదం కాకుండా చూస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అన్నదాతలు ఆందోళన విరమించకుండా కొనసాగించాలన్నదే ఆ అదృశ్య శక్తి అభిమతంలా కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు 11 దఫాలుగా రైతు సంఘాలతో చర్చలు జరిపామని, తమ ప్రతిపాదనలను వారి ముందు ఉంచామని ఆయన చెప్పారు. కానీ వారు ఎంతసేపూ చట్టాలను రద్దు చేయాలనే కోరుతున్నారు గానీ వీటివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదన్నారు. అన్నదాతలు చేసే ప్రతి పాదనను పరిశీలించేందుకు రెడీగా ఉన్నామని, ఇదే విషయాన్ని వారికి పలుమార్లు స్పష్టం చేశామన్నారు. రైతులు ఇన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు గానీ ఒక్కసారి మా ప్రతిపాదనలను పరిశీలిస్తే చాలునని కోరుతున్నామన్నారు. వారి సూచనలను తాము కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంగా హామీ ఇచ్చామన్నారు. . మాచర్చల అనంతరం వారి ధోరణిలో కొంత మార్పు వచ్చిందని, కానీ మళ్ళీ పరిస్థితి యధాప్రకారమైందని తోమర్ పేర్కొన్నారు.
చివరకు ఏడాదిన్నర పాటు ఈ చట్టాలు అమలు కాకుండా నిలుపుదల చేస్తామన్నా రైతులు తమ డిమాండును వీడడంలేదని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. తాను కూడా రైతునే అని, వారి కష్టాలు తనకు తెలుసునని ఆయన చెప్పారు.