
భారతదేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే స్మార్ట్ బోర్డర్ దార్శనికతతో దేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా రూపాంతరం చెందబోతోంది. ఇందుకోసం సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం అనే త్రిసూత్రంతో దేశాన్ని సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పరోక్ష యుద్ధం, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద భావజాలం,డ్రగ్స్, స్మగ్లింగ్, డ్రోన్ దాడులు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను అడ్డుకోవడంతో పాటు సరిహద్దు ప్రాంతాలను మరింత నివాసయోగ్యంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
భారతదేశ సరిహద్దు భద్రతా వ్యవస్థ రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన స్మార్ట్ బోర్డర్ గా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశాన్ని సంపూర్ణంగా చొరబాటు రహితంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం అత్యంత పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన భూ సరిహద్దు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల సదస్సు–2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భూ సరిహద్దు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల సదస్సు దేశ సరిహద్దు భద్రతకు సంబంధించిన సమగ్ర విధానానికి ఒక బలమైన సంస్థాగత రూపాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇదే తరహా వ్యూహాన్ని తీరప్రాంత భద్రతకు కూడా వర్తింపజేస్తామని అమిత్ షా ప్రకటించారు
చతుర్భుజ భద్రతా గ్రిడ్ తో రక్షణ
భారతదేశ రక్షణ విధానాన్ని కేవలం ప్రతిచర్యాత్మకం నుండి క్రియాశీలకంగా మార్చామని హోంమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే సరిహద్దు అవుట్‌పోస్ట్ వ్యవస్థ స్థానంలో సరిహద్దు రక్షణ దళాలు, రాష్ట్ర-జిల్లా పరిపాలన యంత్రాంగం, ప్రభుత్వ భాగస్వాములు, స్థానిక పౌరులను ఏకం చేస్తూ ఒక బలమైన చతుర్భుజ భద్రతా గ్రిడ్ , సమీకృత భద్రతా గ్రిడ్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దేశాన్ని సంపూర్ణంగా చొరబాటు రహితంగా మార్చడమే దీని లక్ష్యమన్నారు. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం.. ఈ మూడు అంశాలు కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు అమిత్ షా.
400 శాతం పెరిగిన మౌలిక సదుపాయాలు
గతంలో దేశంలో సమస్యలు శాశ్వతంగా, పరిష్కారాలు తాత్కాలికంగా ఉండేవని, కానీ మోదీ ప్రభుత్వంలో తాము సమస్యల మూలాలపై దెబ్బకొట్టి పరిష్కారాలను శాశ్వతం చేస్తున్నామన్నారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలలో నక్సలిజం, ఉగ్రవాదం నుండి దేశం విముక్తి పొందడం మన సామూహిక విజయానికి సంకేతమన్నారు. సరిహద్దుల్లో శాస్త్రీయ దృక్పథంతో మౌలిక సదుపాయాల కల్పనను మోదీ ప్రభుత్వం 400 శాతం పెంచిందని గుర్తుచేశారు.
జనాభా మార్పులపై ఉక్కుపాదం
సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్ల కారణంగా జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులపై హోం మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలకు దోహదపడే అసాధారణ కారకాలను గుర్తించి, అటువంటి మార్పులను నివారించడానికి ప్రధాని మోదీ డెమోగ్రఫీ మిషన్ ను ప్రారంభించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరిగే ఇలాంటి అసాధారణ జనాభా మార్పుల సమాచారం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరాలని అధికారులను ఆదేశించారు. చొరబాట్ల వల్ల కలిగే ఈ అసహజ మార్పులను కఠినమైన విధానంతో అరికడతామని స్పష్టం చేశారు.
చివరి గ్రామమే మొదటి గ్రామం
వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం కింద దేశంలోని చివరి గ్రామాన్ని మొదటి గ్రామంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు అమిత్ షా.ఈ పథకం ద్వారా సరిహద్దు గ్రామాల్లో వలసలను నివారించడం, ఉద్యోగాల సృష్టి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100% అమలు చేయడం జరుగుతుందన్నారు. సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి 1,610 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి 31,000 కోట్ల భారీ వ్యయంతో కంచె వేస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు.అక్రమ చొరబాట్లు ఆపడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ పై సంపూర్ణ విజయం సాధించే దిశగా పనిచేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.