Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ వచ్చేస్తోంది.. తొలుత ఏ రూట్‌లో రానుందంటే..

వందే భారత్‌ రైళ్లు కేవలం ఉదయం మాత్రమే అందుబాటులో ఉండడంతో స్లీపర్‌ విధానం అందుబాటులో లేదు. అయితే తాజాగా తొలిసారి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మార్చి నెల నుంచి స్లీపర్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు...

Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ వచ్చేస్తోంది.. తొలుత ఏ రూట్‌లో రానుందంటే..
Vande Bharat Sleeper

Updated on: Feb 06, 2024 | 7:13 PM

భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మారుస్తూ వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అధునాతన సదుపాయాలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రధాన మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రాగా, పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వందే భారత్‌ రైళ్లలో స్లీపర్‌ సదుపాయం లేదు.

వందే భారత్‌ రైళ్లు కేవలం ఉదయం మాత్రమే అందుబాటులో ఉండడంతో స్లీపర్‌ విధానం అందుబాటులో లేదు. అయితే తాజాగా తొలిసారి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మార్చి నెల నుంచి స్లీపర్‌ రైళ్ల ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు, ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును దిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఈ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్‌-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయమై భారతీయ రైల్వేకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను నడపాలని నిర్ణయించాం. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF)లో డిజైన్‌ చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు ఆదా అవుతుంది. తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మాట్లాడుతూ.. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..