Indian Railways: రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు 5 ఏళ్లలోపు పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనంటూ ఇటీవల ఒక వార్త సర్క్యూలేట్ అవుతోంది. ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే.. వాస్తవానికి 5 ఏళ్ల లోపు పిల్లలకు ట్రైన్‌లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇక నుంచి వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. PIB ఫ్యాక్ట్ చెక్ దీనిని పరిశీలించింది. ఇందులో వాస్తవం ఎంత అనేది తేల్చింది. రైల్వే శాఖ నుంచి క్లారిటీ తీసుకుని.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రజలకు వాస్తవాన్ని తెలియజేసింది. పిల్లల టికెట్లకు సంబంధించిన నిబంధనలలో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. పిల్లలకు టికెట్లు తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది ఐచ్ఛికం అని స్పష్టం చేసింది. పిల్లల కోసం బెర్త్ కావాలా? లేదా సీటు కావాలా? అనేదానిపై టికెట్ కొనుగోలు అంశం ఆధారపడి ఉంటుందన్నారు. మరి ఇంతకీ.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు భారతీయ రైల్వేలో టికెట్టు కొనుగోలుకు సంబంధించిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలలకు టికెట్ విషయంలో రైల్వే శాఖ రూల్స్ ఏంటి?
రైల్వే శాఖ నిబంధనల ప్రకారం.. ట్రైన్‌లో రిజర్వ్ చేసిన బెర్త్, సీటులో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వారిని కూడా తమతో పాటు సీటులో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే, పిల్లలకు సెపరేట్ సీటు, బెర్త్ కావాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులకు వర్తించే నిబంధనలే పిల్లలకూ వర్తిస్తాయి. అంటే.. పెద్దలు చెల్లించే విధంగానే పిల్లలకూ టికెట్ ధర చెల్లించాల్సి వస్తుంది. పెద్దలకు ఉన్నట్లుగానే.. పిల్లలకూ టికెట్ ధర సమానంగా ఉంటుంది. అయితే, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తీసుకోవడం పూర్తిగా స్వచ్ఛందం అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సీటు వద్దనుకుంటే.. టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, సీటు కావాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది రైల్వే శాఖ.
5 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు హాఫ్ టికెట్..
పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే వారి కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా బెర్త్ వద్దనుకుంటే మాత్రం పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా, ప్రత్యేక బెర్త్ కోరితే మాత్రం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక శతాబ్ధి వంటి రైళ్లలో పిల్లలకు ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తే ఛార్జీలో సగం చెల్లిస్తే సరిపోతుంది. ఇక పిల్లల వయసు 12 సంవత్సరాలకు పైబడి ఉంటే మాత్రం వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. అందరికీ సమాన ఛార్జీలు ఉంటాయి.
A report by @ZeeNews claims #IndianRailways passengers will now have to buy full ticket for kids below 5 years#PIBFactCheck
▶️It is optional in @RailMinIndia to buy ticket & book a berth for kids below 5 yrs
▶️Free travel is allowed for kids below 5 yrs, if no birth is booked pic.twitter.com/SxWjNxMA9V
— PIB Fact Check (@PIBFactCheck) August 17, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..