Indian New Missile Program: ఇది ఒకప్పటి భారతం కాదు.. మేక్ ఇన్ ఇండియా లాంటి స్థానిక వనరులు, స్థానిక టెక్నాలజీ, స్థానిక మేధోశక్తితో అధునాతన ఆయుధ సంపత్తితో శతృ దుర్భేద్యంగా మారిన భారతమిది. ఎస్.. తాజాగా భారత సైన్యం అమ్ముల పొదికి చేరిన అత్యంత ఆధునాతన ఆయుధాలతో మన దేశం శతృవుల దాడులను ధీటుగా తిప్ప కొట్టగల సత్తా సాధించింది. ఒకప్పటిలా కేవలం డిఫెన్స్‌కే పరిమితమయ్యే దేశం కాదీనాడు. అవసరమైతే శతృవుల భూభాగంపైకి వెళ్ళి ధీటుగా జవాబిచ్చి రాగల దూకుడు ప్రదర్శిస్తోంది ఇండియన్ ఆర్మీ.
భారత అమ్ముల పొదిలో కొత్త అస్త్రాలు చేరుతున్నాయి. ఇప్పటికిప్పుడు చైనాతో గానీ పాకిస్తాన్‌తో గానీ యుద్ధం వచ్చినా భారత్ ధీటుగా తిప్పకొట్టగలదు. అంతటి సైనిక సామర్థ్యమే కాదు.. ఆయుధ సంపత్తి ఇపుడు భారత్ సొంతం. తాజాగా భారత్‌కు మరిన్ని (క్షిపణులు) మిస్సైల్స్ అందుబాటులోకి వచ్చాయి. శత్రువులు ఆలోచించేలోపే వారి స్థావరాల్ని ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది.
హెలీనా, ధృవాస్త్ర క్షిపణులు
ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు హెలీనా, ధృవాస్త్ర. ఈ తరహా క్షిపణుల్లో ఇవి అత్యంత ఆధునికమైనవని డిఆర్డీఓ వర్గాలు చెబుతున్నాయి. ఆకాశం నుంచే భూమిపై ఉన్న శత్రు బంకర్లను నాశనం చేయగలవు ఈ హెలినా, ధృవాస్త్ర మిసైళ్ళు. ఈ మిసైళ్ళు సైన్యానికి, భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగమని రక్షణ రంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆకాశం నుంచి భూమ్మీది లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల్లో ఆర్మీకి అందించే మిస్సైల్ వెర్షన్ పేరు హెలినా కాగా.. ఎయిర్ ఫోర్స్‌కు అందించే మిస్సైల్ వర్షన్ పేరు ధృవాస్త్ర. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు ఈ రెండు క్షిపణులను. గతంలో ఇలాంటి క్షిపణే కానీ కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించే సత్తా గల వాటి పేరు నాగ. నాగ మిస్సైల్‌ను మరింత ఆధునీకరించి రూపొందించినవే ఈ హెలినా, ధృవాస్త్ర మిస్సైళ్ళు. 8 కిలో మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా ఛేదించే సత్తా వున్నవి హెలీనా, ధృవాస్త్ర మిసైళ్ళు.
ఈ హెలీనా, ధృవాస్త్ర మిస్సైళ్లను డీఆర్‌డీవో డెవలప్ చేసింది. శత్రువుల ట్యాంకులను పేల్చివేసే ధృవాస్త్రకు సంబంధించి మూడు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. డీఆర్డీఓ రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. కదిలే యుద్ద ట్యాంకులను, కదల కుండా ఉన్నయుద్ద ట్యాంకులను గుర్తించనున్నహెలీనా, ధృవాస్త్ర మిసైళ్ళు. లక్ష్యాలను చీకట్లోనైనా, వెలుతురులో నైనా ఖచ్చితంగా గుర్తిస్తాయని డీఆర్డీఓ అధికారులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన రాజస్ధాన్ లోని ఫోఖ్రాన్ దగ్గర హెలీనా ట్రయల్స్ విజయవంతం కాగా.. గత జులై 23వ తేదీన ఒడిషాలోని బాలాసోర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి ధృవాస్త్ర ప్రయోగాలు సక్సెస్సయ్యాయి.
తుపాకులు మొదలుకొని యుద్ద విమానాలు, యుద్ద నౌకల దాకా ప్రతీ రక్షణ రంగ అవసరానికి ఒకప్పుడు రష్యా.. తాజాగా అమెరికా లాంటి దేశాల మీద భారత్ ఆధారపడి వుండేది. ఇజ్రాయిల్, దక్షిణ కొరియా వంటి చిన్న దేశాల నుంచి కూడా మన రక్షణ రంగ కొనుగోళ్ళు జరిగేవి. ఇదంతా దశాబ్ధం క్రితం. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌తో దేశీయంగా రక్షణ రంగం పరిశోధనలు ఊపందుకున్నాయి. వాటి ఉత్పత్తికి పలు చిన్నా, పెద్దా పరిశ్రమలు ముందుకు రావడంతో విడిభాగాల తయారీ సులభతరమైంది. ఫలితంగా డీఆర్డీఓ ప్రయోగాలకు అనుగుణంగా రక్షణ రంగ ఉత్పత్తులు శరవేగంగా తయారవడం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే హెలీనా, ధృవాస్త్ర క్షిపణులు శరవేగంగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇందులో ఒకటి ఆర్మీకి చేరగా.. మరొకటి ఎయిర్‌ఫోర్స్ అమ్ముల పొదికి చేరింది. అవసరం మేరకు సత్తా చాటేందుకు రెడీగా వున్నాయి.
Also Read: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. షాకింగ్ విషయమేంటంటే?