భారత ఆర్మీ సమూల మార్పులకు లోను కాబోతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసేందుకు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం మానవశక్తిపైనే సాంకేతిక పరిజ్ఞానంతో సైన్యాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేపట్టింది భారత్. శత్రువును ఎదుర్కొనేందుకు అన్ని వేళలా సన్నద్ధత కోసం సైనికులకు అత్యాధునిక ఈక్విప్‌మెంట్స్ అందుబాటులోకి రానున్నాయి. చైనాతో సరిహద్దుల వెంబడి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకొని కొత్త సాధనసంపత్తిని ఇండియా సమకూర్చుకుంటోంది.
సరిహద్దుల్లో దీర్ఘకాలిక నిఘా అవసరాల కోసం ప్రత్యేకమైన డ్రోన్ సిస్టమ్స్, సుదూరాన ఉండే సరిహద్దుల్లో రవాణా అవసరాల కోసం రోబోటిక్ మ్యూల్స్‌కు సైన్యం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. అంతే కాకుండా గాలిపైనా, నీటిపైనా, భవనాలపైనా తేలియాడే సరికొత్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జెట్ ప్యాక్స్ కొనుగోలుకు ఇండియా ఆసక్తి చూపుతోంది.
జెట్‌ప్యాక్స్ కొనుగోలుకు ఇండియా ఆసక్తి చూపడంతో వాటిని సరఫరా చేసేందుకు బ్రిటన్‌కు చెందిన గ్రావిటీ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఆ సంస్థ యజమాని రిచర్డ్ బ్రౌనింగ్ స్వయంగా ఆ జెట్ ప్యాక్స్ పనితీరును సైనికాధికారుల ముందు ప్రదర్శించారు. ఆగ్రాలోని ఇండియన్ ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రెయినింగ్ స్కూల్‌లో ఈ డెమో నిర్వహించారు. ఈ జెట్ ప్యాక్స్ ధరించిన సైనికులు నీళ్ల మీద తేలియాడవచ్చు, భవనాలు పొలాలపై నుంచి ఎగరవచ్చు.
ఈ జెట్ ప్యాక్స్ ధరించిన సైనికులు గాల్లో ఎగరవచ్చు. గాల్లో ఎగిరేలా చూసేందుకు ఈ పరికరానికి గ్యాస్ లేదా లిక్విడ్ అవసరం. ప్యాట్రోలింగ్, నిఘా అవసరాలను ఈ జెజ్‌ప్యాక్స్ ఉపయోగించాలని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది. వాహనాల రాకపోకలు సాగించలేని ప్రాంతాల్లోకి వెళ్లేందుకు లేదా వాహనం కోసం ఎదురచూడటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ జెట్‌ప్యాక్స్ ధరించి గాల్లో తేలుకుంటూ సైన్యం ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.
యుద్ధపరిస్థితిని సమూలంగా మార్చేసే ఈ జెట్‌ప్యాక్స్ సాయంతో ఒక సైనికుడు 10 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇంజిన్, బ్యాటరీలతో కూడిన జెట్‌ప్యాక్స్ బరువు 50 కేజీలు ఉంటుంది. ఒక సైనికుడిని 3000 మీటర్ల ఎత్తుకు లేపగల జెట్‌ప్యాక్స్ కావాలని ఇండియన్ ఆర్మీ కోరుకుంటోంది. గంటకు 50 కిలోమీటర్ల వేగం, 80 కేజీల మనిషిని ఎత్తగల సామర్ధ్యం కలిగిన జెట్ ప్యాక్స్ కోసం ఇండియన్ ఆర్మీ ఈ మధ్యే టెండర్లు పిలిచింది.
తొలి విడతలో మొత్తం 48 జెట్‌ప్యాక్స్ కొనుగోలుకు ఇండియన్ ఆర్మీ టెండర్లు పిలిచింది. భారత్‌కు చెందిన ఒక కంపెనీ కూడా దాదాపు 70 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జెట్‌ప్యాక్స్ డెమో ఇచ్చింది. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చే అవకాశం ఉండటంతో బ్రిటన్‌కు చెందిన గ్రావిటీ ఇండస్ట్రీస్ అధినేత స్వయంగా వచ్చి డెమో ఇచ్చారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత భారతీయ అవసరాలకు తగిన ఈక్విప్‌మెంట్‌ను ఇండియా కొనుగోలు చేయనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..