India – China Border: తూర్పు లద్దాఖ్ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. డ్రాగన్‌పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. తూర్పు లద్దాఖ్‌లో భారీ సంఖ్యలో కే9- వజ్రా హోవిజ్జర్ గన్స్‌ను గురిపెట్టింది. నియంత్రణ రేఖ దగ్గర భారత్ కొత్త ఆయుధాన్ని మోహరించింది. చైనా సరిహద్దులో ఉన్న ఎల్‌ఏసీ దగ్గర తొలిసారి కే9- వజ్రా హోవిజ్జర్ గన్నులను ఇండియన్ ఆర్మీ ఎక్కుపెట్టింది.
కే9-వజ్రా గన్ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుత్రు టార్గెట్లను ధ్వంసం చేయగలదు. కే9-వజ్రా హోవిజ్జర్‌కు చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని లడాఖ్‌లో మోహరించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తెలిపారు. కే9 వజ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయని చెప్పారు. ఫీల్డ్ ట్రయల్స్ సమయంలో హోవిజ్జర్ గన్నులు చాలా సక్సెస్ రేటును చూపినట్లు తెలిపారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా ఇక్కడ మోహరించడం వల్ల అది మనకు ఎంతో ఉపకరిస్తుందని మనోజ్ ముకుంద్ చెప్పారు.
లద్దాక్‌లో గత ఆరునెలల నుంచి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. అక్టోబర్ రెండో వారంలో చైనా సైన్యంతో 13వ రౌండ్ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చల్లో దళాల ఉపసంహరణపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఉన్నాయి. చెప్పారు.. ఈస్ట్రన్ లడాఖ్, నార్తర్న్ ఫ్రంట్ నుంచి ఈస్ట్రన్ కమాండ్ వరకు చైనా తన సైన్యాన్ని మోహరించింది. చైనా తన ఫార్వర్డ్ ప్రాంతాల్లో దళాలను పెంచిందని, ఇది కొంత ఆందోళనకరమైన అంశంగా భారత్ భావిస్తోంది.
సరిహద్దుల దగ్గర చైనా గ్రామాలను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనా దళాల కదిలికలను నిత్యం గమనిస్తూనే ఉన్నామని, తమకు వచ్చిన సమాచారం మేరకు, తగిన రీతిలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే రీతిలో సంసిద్దం అవుతున్నట్లు ఆయన చెప్పారు.
Read also: Mahatma Gandhi: తూర్పుగోదావరితో మహాత్మాగాంధీకి విడదీయలేని బంధం.. జిల్లా అంతటా బాపు పాదముద్రలు.!