Air Force Day 2022: చండీగఢ్‌లో కన్నుల పండవగా ఎయిర్‌ షో.. ఒళ్లు గగుర్పొడిచేలా జవాన్ల విన్యాసాలు

తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వెలుపల జరుగుతున్న ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్..

Air Force Day 2022: చండీగఢ్‌లో కన్నుల పండవగా ఎయిర్‌ షో.. ఒళ్లు గగుర్పొడిచేలా జవాన్ల విన్యాసాలు
Air Show In Chandigarh

Updated on: Oct 09, 2022 | 8:05 AM

IAF 90వ వార్షికోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సుపై 80 విమానాలతో వైమానిక దళ సిబ్బంది ఆకాశంలో చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వెలుపల జరుగుతున్న ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఎంపీ కిరణ్ ఖేర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎయిర్ షోను ఎంజాయ్ చేశారు. కాగా వైమానిక ప్రదర్శనలను తిలకించడానికి స్థానికులు కూడా భారీగా తరలివచ్చారు. సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ ఎయిర్ షోలో రాఫెల్, సుఖోయ్, మిగ్, ప్రచండ, మిరాజ్, చేతక్, చిరుత, చినూక్, రుద్ర వంటి 80కి పైగా విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ఎయిర్‌ ఫోర్స్‌ లో శిక్షణ పొందిన జవాన్లు పారాచూట్ల సహాయంతో వేల అడుగుల ఎత్తులో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి.

మరోవైపు వార్షికోత్సవం వేళ.. ఐఏఎఫ్ దళం కోసం వెపన్ సిస్టమ్‌ బ్రాంచ్ ఏర్పాటునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. వెపన్‌ సిస్టం బ్రాంచ్‌ కింద వైమానిక సిబ్బంది అత్యాధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందుతారు. స్వాతంత్య్రం తర్వాత ఈ తరహా ఏర్పాటు ఇదే మొదటిది. దీని ద్వారా ప్రభుత్వానికి 3,400 కోట్లు ఆదా కానుంది. ఇక భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కొత్త యూనిఫాంను ఎయిర్‌ చీఫ్ వివేక్‌ రామ్‌చౌదరి ఆవిష్కరించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ యూనిఫాం ప్రత్యేకత. సైన్యం యూనిఫారాన్ని పోలిన కొత్త యూనిఫాం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్తంగా రూపొందించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..