భారత్‌లో మెట్రో జోరు.. అమెరికా బేజారు.. మరో రెండేళ్లలో ప్రపంచ రికార్డు..
ప్రపంచ రవాణా ముఖచిత్రంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రానున్న రెండేళ్లలోనే అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్‌గా భారత్ అవతరించనుంది. చైనా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా పట్టాలెక్కుతున్న భారత మెట్రో వ్యవస్థ, దేశ మౌలిక వసతుల విప్లవానికి నిదర్శనంగా నిలుస్తోంది.

భారత పట్టణ రవాణా రంగంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతుంది. రానున్న రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్‌గా అవతరించేందుకు భారత్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అమెరికాను త్వరలోనే అధిగమించనున్నట్లు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని వాణిజ్య రాజధాని ఇండోర్‌లో విస్తరించిన నూతన మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మైలురాయి వివరాలను వెల్లడించారు. గడిచిన దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరించింది. ప్రస్తుతం భారత్‌లోని 26 ప్రధాన నగరాల్లో మెట్రో నెట్‌వర్క్ ఏకంగా 1,170 కిలోమీటర్ల మేర కార్యకలాపాలు సాగిస్తుంది.
అమెరికాలోని మొత్తం మెట్రో నెట్‌వర్క్ పొడవు 1,386 కిలోమీటర్లు కాగా భారత్ కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాల్లో, 245 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు అది రికార్డు స్థాయిలో విస్తరించింది. ప్రస్తుతం మరో 900 కిలోమీటర్ల మేర పనులు శరవేగంగా సాగుతుండటంతో అతి త్వరలోనే అమెరికాను దాటి ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవనుంది.
తాజాగా ప్రారంభమైన ఇండోర్ మెట్రో విస్తరణ స్థానిక రవాణా రంగంలో పెను మార్పులకు నాంది పలికింది. గతంలో 6.3 కిలోమీటర్లకే పరిమితమైన ఇండోర్ మెట్రో మార్గం, తాజా విస్తరణతో ఏకంగా 17.5 కిలోమీటర్లకు చేరింది. గాంధీ నగర్ నుంచి మాలవ్య నగర్ చౌరహా వరకు విస్తరించిన ఈ కారిడార్ ద్వారా ప్రధాన నివాస ప్రాంతాలు, వ్యాపార కూడళ్లు మెట్రో పరిధిలోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండేలా, రోజుకు 80కి పైగా ట్రిప్పులను నడిపిస్తూ వేలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ రహిత సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.
టైర్-1, టైర్-2 నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్ కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో మెట్రో సేవలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఆధునిక పట్టణ రవాణా మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ చేపట్టిన భారీ ప్రాజెక్టులు దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నాయి.
