India Potential cases: కనిపించని కరోనా మహమ్మారిపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా జనవరి 16 శనివారం కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజలకు ఇవ్వాలని తలపెట్టిన ఈ టీకాల కార్యక్రమాన్ని ఒక పారిశుధ్య కార్మికుడితో మొదలుపెట్టారు.
అయితే, ప్రస్తుతం భారత్‌లో వైరస్ కొత్త రకం వేరియంట్ గందరగోళానికి గురి చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలతో ప్రాణాలు చనిపోతారన్న అపోహలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్‌లో అత్యంత తక్కువ అని ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం నివేదిక సమర్పించింది.
వ్యాక్సిన్లపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ నేషనల్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీని నియమించింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల పనితీరుపై పూర్తి స్థాయి విశ్లేషించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాక్సిన్ల వాడకం ద్వారా అతి స్వల్పస్థాయిలో రక్తస్రావం, రక్తం గడ్డకున్న ఘటనలు నమోదు అయ్యినట్లు పేర్కొంది. ముఖ్యంగా కోవిషీల్డ్ డోసుల అనంతరం ఈ ఘటనలు నమోదు అయ్యినట్లు తెలిపింది. దాదాపు మొత్తంగా 498 సీరియస్ కేసులను విశ్లేషించిన కమిటీ.. అందులో 26 కేసుల్లో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించినట్లు తమ నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో 10 లక్షల డోసులకు గాను 0.61 కేసుల్లోనే దుష్పరిణామాలు ఎదురయినట్టు తన నివేదికలో పేర్కొంది. అయితే ఇవన్నీ కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలోనే అని, కొవాగ్జిన్ వేసుకున్నవారిలో రక్త గడ్డకట్టడం వంటి ఘటనలు నమోదు కాలేదని వివరించింది. కాగా, రెండు వ్యాక్సిన్లు కూడా సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఈ ఏడాది మార్చి 11న కొన్ని దేశాల్లో ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ అంశంపై లోతైన విశ్లేషణ చేయాలంటూ ఏఈఎఫ్ఐ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రంగంలోకి దిగిన కమిటీ… దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 3 నాటికి 7,54,35,381 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. అందులో 23 వేల మందికి దుష్పరిణామాలు కనిపించాయని తెలిపింది.
ఇదిలావుంటే, బ్రిటన్‌లో ఇది ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులు, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు 10 కేసులు ఇటువంటి నమోదయినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది. ‘‘సాధారణ జనాభాలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్పరిణామాలను ఎదురవుతున్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం… నేపథ్యం, శాస్త్రీయ కారణాలను పరిగణనలోకి తీసుకుంటే యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ, ఆగ్నేయాసియా సంతతికి ఈ ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని సూచిస్తుంది’’ అని తెలిపింది.
రక్తం గడ్డకట్టడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాక్సిన్ భయాలను తొలగించాలని అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, గుండెల్లో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. గత నెలలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు.
ఇదిలావుంటే, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఎదురుకావడంతో డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కోవిషీల్డ్‌ను నిషేధించాయి. దీనిపై ఐరోపా సమాఖ్య మెడికల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి కోవిషీల్డ్ సురక్షితమైందేనని, ప్రభావంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.