అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు

India US Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రతిపాదించిన 12.5% అదనపు సుంకాన్ని 10%కు తగ్గించింది. భారత్ చేసే ఎగుమతుల్లో 45% ఉత్పత్తులకు ఈ సుంకం వర్తించదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.

అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు
Us Tariffs On India

Updated on: Jul 26, 2026 | 10:02 AM

US Tariffs on India Telugu: భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై విధించనున్న అదనపు సుంకాన్ని అమెరికా తగ్గించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)తో జరిగిన సంప్రదింపుల కారణంగా మొదట ప్రతిపాదించిన 12.5 శాతం అదనపు సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. అలాగే భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement – BTA) త్వరగా పూర్తయ్యే దిశగా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద భారత్ నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై శుక్రవారం నుంచి అదనంగా 10 శాతం యాడ్ వలోరమ్ సుంకం విధించింది. జూన్ 2, 2026న ప్రకటించిన ముసాయిదాలో ఈ సుంకాన్ని 12.5 శాతంగా ప్రతిపాదించగా, భారత్ చేసిన చర్చలతో దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది.

USTRతో విస్తృత చర్చలు

ఈ నిర్ణయానికి ముందు భారత్, USTR కార్యాలయంతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లిఖితపూర్వక వివరణలు సమర్పించడమే కాకుండా, ప్రత్యక్ష సమావేశాలు, ప్రజా విచారణల్లో కూడా పాల్గొన్నట్లు వెల్లడించింది. ఈ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అదనపు టారిఫ్‌లలో భారత్‌ను తక్కువ సుంకం విధించే వర్గంలో (Lower Tier) ఉంచారని, దీంతో కీలక ఎగుమతి రంగాలకు ఇతర దేశాలతో పోలిస్తే పోటీ ప్రయోజనం లభిస్తుందని పేర్కొంది.

ఎందుకు ఈ సుంకాలు?

బలవంతపు కార్మికుల(వెట్టిచాకిరి)తో తయారైన ఉత్పత్తుల దిగుమతులపై వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన అనంతరం, భారత్ సహా 60 దేశాలపై USTR ఈ తుది చర్యలు తీసుకుంది.

45% భారత ఎగుమతులకు ప్రభావం లేదు

అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే పలు కీలక ఉత్పత్తులు ఈ అదనపు 10 శాతం సుంకం నుంచి మినహాయింపు పొందాయి. ముఖ్యంగా: జనరిక్ ఔషధాలు (Generic Pharmaceuticals), స్మార్ట్‌ఫోన్లు, ఇతర నిర్దిష్ట ఉత్పత్తులు. ఇవి అదనపు సుంకం పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే సెక్షన్ 232 కింద ఇప్పటికే ప్రత్యేక సుంకాలు అమల్లో ఉన్న స్టీల్, అల్యూమినియం, ఆటో పార్ట్స్ వంటి ఉత్పత్తులపై ఈ కొత్త 10 శాతం సుంకం వర్తించదని తెలిపింది. దీంతో అమెరికాకు భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో సుమారు 45 శాతం ఉత్పత్తులు అదనపు సుంకం పరిధికి బయటే ఉంటాయని పేర్కొంది.

మిగిలిన ఎగుమతులపై కూడా భారత్‌కు ప్రయోజనం

మిగిలిన 55 శాతం ఎగుమతులపై అదనపు సుంకం వర్తించినప్పటికీ, ఇతర ప్రభావిత దేశాలతో పోలిస్తే భారత్‌పై విధించిన టారిఫ్ భారం తక్కువగానే ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వస్త్ర పరిశ్రమపై చర్చలు కొనసాగుతున్నాయి

అమెరికా ప్రకటించిన తుది చర్యల్లో వస్త్ర రంగానికి సంబంధించిన ప్రత్యేక విధానం (Textile-specific mechanism) ఇంకా అమల్లోకి రాలేదని కేంద్రం తెలిపింది. అమెరికా పత్తి, ఫైబర్‌ను ఉపయోగించే బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు టారిఫ్ రేట్ కోటా (TRQ) అమలు చేసే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ అంశంపై కూడా భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లో భాగంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది.

వాణిజ్య ఒప్పందంపై ఆశాభావం

ఫిబ్రవరి 2, 2026న ప్రకటించిన భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి, అలాగే ఫిబ్రవరి 7న విడుదల చేసిన సంయుక్త ప్రకటనకు కట్టుబడి ఉన్నామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

Follow Us