విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పండించే యాపిల్స్ కంటే విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌నే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నందున స్వదేశంలోని యాపిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలనుంచి వచ్చే యాపిల్స్ తక్కువ ధరకు లభ్యంకావడంతో వాటికి డిమాండ్ అధికంగా ఉంటోంది. దీంతో దేశీయంగా యాపిల్స్ పండిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలోని యాపిల్‌లకు విదేశీ యాపిల్పండ్లతో పోటీ పెరిగినందున, కిలోకు రూ.50 కంటే తక్కువ ఉన్న పండ్ల దిగుమతిని భారత్ నిషేధించింది. యాపిల్ సీఐఎఫ్(ధర, బీమా, సరకు) ధర రూ.50 కంటే ఎక్కువగా ఉంటే దిగుమతి చేసుకోవచ్చని, ఐతే భూటాన్ నుంచి వచ్చే పండ్లకు దిగుమతి ధర వర్తించదని డైరెక్టరేట్‌జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా భారత్‌కు యాపిల్స్‌ను ఎగుమతి చేస్తున్న దేశాల్లో టర్కీ, ఇటలీ, ఇరాన్, చిలీ అగ్రస్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పోలాండ్, అమెరికా, బ్రెజిల్, యూఏఈ, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి కూడా యాపిల్ పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ దేశాలన్నింటిపై ఈ నిషేదం వర్తిస్తుంది. ఈ నిర్ణయం పట్ల యాపిల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.