చెన్నై, అక్టోబర్ 23: ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. గత పాతికేళ్లుగా యాక్టివ్‌గా ఉన్న గౌతమి ఈ రోజు (అక్టోబర్ 23) తన రాజీనామా లేఖను ట్వీట్ చేశారు. ఈ మేరకు బీజేపీతో తన అనుబంధానికి నేటితో ముగింపు పలికారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ సీనియర్ నేతలు అండగా నిలిచారని, తనకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని లేఖలో గౌతమి ఆరోపించారు.
‘ఈ రోజు నా జీవితంలో ఊహించని సంక్షోభంలో ఉన్నాను. పార్టీ నాయకుల నుంచి నాకు మద్ధతు కరువయ్యింది. సి అళగప్పన్‌కు పార్టీ సీనియర్ నేతలు అండగా నిలిచారు. నా ఆస్తి పత్రాలు, డబ్బు మోసగించిన అతనికి సపోర్ట్ చేయడం బాధగా ఉంది. చాలా బాధతో ఉన్నాను. అళగప్పన్ 20 ఏళ్ల క్రితం నా ఒంటరితనం, నా బలహీనత చూసి నన్ను సంప్రదించారు. ఆ సమయంలో నేను నా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథను మాత్రమేకాదు.. ఒంటరి తల్లిని కూడా. ఈ సమయంలో నేను నా భూములకు సంబంధించిన పత్రాలను ఆయన చేతిలో పెట్టాను. కానీ అతను నన్ను మోసం చేశాడనే విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాను. అతని కుటుంబంలోకి నన్ను, నా కుమార్తెను స్వాగతిస్తున్నట్లు నటిస్తూ నమ్మకద్రోహం చేశాడు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారు. అయినప్పటికీ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నాను. పాతికేళ్లుగా పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాకు మద్దతు కరువైంది. చాలా బాధలో నా రాజీనామా లెటర్ ఇస్తున్నాను. కానీ ధృత నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అనే క్యాప్షన్‌తో జేపీ నడ్డా, పార్టీ తమిళనాడు చీఫ్ కె అన్నామలైని ట్యాగ్ చేశారు.
A journey of 25 yrs comes to a conclusion today. My resignation letter. @JPNadda @annamalai_k @BJP4India @BJP4TamilNadu pic.twitter.com/NzHCkIzEfD
— Gautami Tadimalla (@gautamitads) October 23, 2023
కాగా నటి గౌతమికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత అళగప్పన్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పోలీసు, న్యాయవ్యవస్థ తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలోని శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన గౌతమి విశాఖపట్నంలో తన చదువు పూర్తి చేశారు. విశాఖలో చదువుకుంటున్న సమయంలోనే సినీ అవకాశాలు రావడంతో నటనలోకి ప్రవేశించింది. ఆమె తన కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.