ఎన్డీఏ ఆవిర్భవించిన తర్వాత కూటమిలోంచి బయటకు వచ్చిన 29 పార్టీలు

భావసారూప్యత కలిగిన పార్టీలే ఎల్లకాలం కలిసిమెలిసి ఉండలేవు.. అలాంటిది ఏ సారూప్యత లేని పార్టీలు ఎలా కలిసి ఉంటాయి.. ఆ మాటకొస్తే కూటమి అన్న తర్వాత పార్టీల మధ్య పొరపొచ్చాలు రావడం సహజమే!

ఎన్డీఏ ఆవిర్భవించిన తర్వాత కూటమిలోంచి బయటకు వచ్చిన 29 పార్టీలు

Edited By:

Updated on: Sep 19, 2020 | 2:25 PM

భావసారూప్యత కలిగిన పార్టీలే ఎల్లకాలం కలిసిమెలిసి ఉండలేవు.. అలాంటిది ఏ సారూప్యత లేని పార్టీలు ఎలా కలిసి ఉంటాయి.. ఆ మాటకొస్తే కూటమి అన్న తర్వాత పార్టీల మధ్య పొరపొచ్చాలు రావడం సహజమే! ఉన్న కూటమిని వదిలేసి కొత్త ఫ్రంట్‌లో చేరడమూ సహజమే! పాతికేళ్ల దేశ రాజకీయాలలో ఇలాంటివి ఎన్నో చూసి ఉంటాం! ఎన్‌డీయే నుంచి యూపీఏలోకి వెళ్లడం, యూపీఏ నుంచి ఎన్‌డీఎలోకి రావడం చాలా సార్లు జరిగాయి.. అంతెందుకు ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమెక్రటిక్‌ అలయన్స్‌లోనే ఇలాంటి పరిస్థితిని చూశాం! 22 ఏళ్ల కిందట ఎన్‌డీఏ కూటమి ఆవిర్భవించింది.. ఈ 22 ఏళ్లలో అందులోంచి 29 పార్టీలు బయటకొచ్చాయి.. కొన్ని కొత్త పార్టీలు అందులో చేరాయి.. 1998లో ఎన్‌డీఎ ఏర్పాటయ్యింది.. అప్పుడు ఛైర్మన్‌ బాధ్యతలను వాజ్‌పేయి చేపట్టారు.. అప్పుడే బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఎ కూటమి అధికారంలోకి వచ్చింది.. వాజ్‌పేయి ప్రధాని కాగలిగారు.. 2004 వరకు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ సారథ్యంలోని యునైటెడ్‌ ప్రొగ్రసివ్‌ అలయెన్స్‌ కూటమి అధికారంలోకి వచ్చింది.. ఎన్‌డీఎ అధికారం కోల్పోయిన తర్వాత వాజ్‌పేయి కూడా క్రీయాశీలక రాజకీయాలకు కాసింత దూరంగా ఉన్నారు.. అప్పుడు ఎన్‌డీఎ ఛైర్మన్‌ బాధ్యత భారం ఎల్‌.కె.అద్వానీపై పడింది.. ప్రస్తుతం ఆ బాధ్యతలను అమిత్‌షా చేపట్టారు.. ఇక ఆ కూటమిలో ఛైర్మన్‌ తర్వాత కీలకమైన పదవి కన్వీనర్‌… 1998లో కన్వీనర్‌ పదవిని జార్జ్‌ ఫెర్నాండేజ్‌ చేపట్టారు.. ఎన్‌డీఎలో ఇప్పుడా పదవే లేదనుకోండి.. 1998లో ఏర్పడిన ఎన్‌డీఎ కూటమిలో జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు చెందిన సమతాపార్టీ, అన్నా డీఎంకే, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ అకాలీదళ్‌, శివసేనలు భాగస్వాములుగా ఉన్నాయి.. అప్పటి వరకు యునైటెడ్‌ ఫ్రంట్‌లో ఉన్న తెలుగుదేశంపార్టీనేమో బయట నుంచి మద్దతు ఇచ్చింది.. ఆ తర్వాత బిజూ జనతాదళ్‌, శిరోమణి అకాలీదళ్, తృణమూల్‌ కాంగ్రెస్‌, లోక్‌శక్తి, ఎండీఎంకే, హర్యానా వికాస్‌ పార్టీ, జనతాపార్టీ, మిజో నేషనల్‌ పార్టీ చేరాయి.. అన్నాడీఎంకే బయటకు వచ్చిన తర్వాత ఆ స్థానంలోకి డీఎంకే అడుగుపెట్టింది.. అంతెందుకు 2013లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎన్డీఎలో 29 పార్టీలు భాగస్వాములుగా ఉండేవి.. ఎన్నికల తర్వాత కొన్ని కొత్త పార్టీలు ఎన్‌డీఎలో చేరాయి.. మోదీ ప్రధాని అయిన తర్వాత 16 పార్టీలు ఎన్‌డీఎ నుంచి వైదొలిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత శివసేన, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ పార్టీలు ఎన్‌ఎడీ నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు మొదటి నుంచి కూటమిలో కొనసాగుతున్న అకాలీదళ్‌ ఎన్‌డీఎ నుంచి బయటపడాలనుకుంటోంది..