తీహార్ జైల్లో ఉన్న మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీపై మరో లెటర్ బాంబ్ పేల్చారు. రూ.50 కోట్లు ఇస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆప్ నుంచి వచ్చిన ఆఫర్‌ను బయటపెట్టిన్నందుకు బెదిరింపులు వస్తున్నాయని మరో లేఖ విడుదల చేశారు సుఖేశ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆప్‌లో చేరి రూ.500 కోట్ల నిధులు సమకూర్చాలని కేజ్రీవాల్ కోరినట్టు సంచలన ఆరోపణలు చేశారు సుఖేశ్ చంద్రశేఖర్. ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు తాను రూ.10 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తన లాయర్ ద్వారా అంతకు ముందులేఖ రాశారు సుఖేశ్. మంత్రి సత్యేంద్రజైన్ కూడా మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించడానికి సత్యేంద్ర జైన్ తన నుంచి డబ్బులు డిమాండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు సుఖేశ్ చంద్రశేఖర్. కేజ్రీవాల్ సర్కార్ చేయని అవినీతి లేదంటూ బీజేపీ విమర్శించింది. కాగా ఈ విషయంపై బీజేపీ నేత గౌరవ్ భాటియా మాట్లాడుతూ ‘మోసగాడు సుఖేవ్ చంద్రశేఖర్‌తో ఆప్ సంబంధాలు బయటపడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ తనకు తరచుగా ఫోన్ చేసినట్టు ఆయన లెటర్‌లో రాశాడు. వ్యాపారులు , పారిశ్రామికవేత్తల నుంచి డబ్బును వసూలు చేయాలని సుఖేశ్‌కు కేజ్రీవాల్ ఫోన్ చేసినట్టు స్పష్టమవుతోంది’ అని మండిపడ్డారు.
మరోవైపు బీజేపీ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ. బీజేపీకి సుఖేశ్ చంద్రశేఖర్ స్టార్ క్యాంపెయినర్ గా మారారని ఆరోపించింది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కోలేక తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్‌తో బీజేపీ డీల్ చేసుకుందని ఆప్ నేతలు మండిపడ్డారు. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ను విడుదల చేస్తామని బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చినట్టు తెలిపారు. అంతేకాకుండా లిక్కర్ స్కాంలో కూడా ఆప్ నేతలను తప్పిస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని , కాని తాము ఒప్పుకోలేదన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పీఏ దేవేంద్రశర్మ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. సిసోడియా ఐదుగురు సన్నిహితుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సోదాల్లో ఏమి దొరక్కపోవడంతో తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేసేందుకు తీసుకెళ్లారని ఆరోపించారు మనీష్ సిసోడియా.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి