2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని? కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Congress MP Shashi Tharoor: అధికారపక్షం బీజేపీపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ జాతీయ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు ఎంపీ శశి థరూర్. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన..
శశి థరూర్.. కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. మూడుసార్లు తిరువనంతపురం ఎంపీగా గెలిచిన ఆయన.. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. అధికారపక్షం బీజేపీపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ జాతీయ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన థరూర్.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను 2024లోనూ పునరావృతం చేయడం బీజేపీకి సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువలో తక్కువ 50 సీట్లు కోల్పోవచ్చని జోస్యం చెప్పారు. కోళికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడిన ఆయన.. బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ.. చాలా రాష్ట్రాలను ఆ పార్టీ కోల్పోయిందని, కేంద్రంలోనూ అధికారాన్ని కోల్పోవడం ‘అసాధ్యం’ కాదని వ్యాఖ్యానించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 303 స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు పరిమితమయ్యింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272 కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాదాపు 250 స్థానాలకు పరిమితం కావచ్చని శశి థరూర్ జోస్యం చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే 20-30 స్థానాలు బీజేపీకి తగ్గే అవకాశముందని ఆయన అంచనావేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలను విశ్లేషిస్తూ.. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ గెలిచిందని గుర్తుచేశారు. అలాగే బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక స్థానం మినహా మిగిలిన సీట్లను బీజేపీ గెలుచుకుందన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఏకంగా 18 స్థానాల్లో విజయంసాధించిందని గుర్తుచేశారు.
అయితే ఈ రాష్ట్రాల్లో అదే రకమైన ఫలితాలను 2024 సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం చేయడం బీజేపీకి అసాథ్యమని శశి థరూర్ పేర్కొన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు. దాదాపు 50 సీట్లు బీజేపీకి తగ్గే అవకాశముండగా.. ఇది విపక్షాలకు ప్లస్ అవుతుందని విశ్లేషించారు. అదే సమయంలో విపక్షాల మధ్య ఐక్యత సాధ్యమా? అన్న ప్రశ్నకు దీనికి సమాధానం చెప్పడం అసాథ్యమని థరూర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ 250 స్థానాలకు పరిమితమై.. ఇతర పక్షాలు 290 స్థానాలు సాధిస్తే.. 290 స్థానాలు సాధించిన విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా..? కేంద్రం నుంచి ప్రయోజనాలు ఆశించే కొన్ని పార్టీల నుంచి మరో 30 మందిని బీజేపీ తన వైపునకు తిప్పుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అన్నది మనం ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.
కాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న అంశంపై జరుగుతున్న చర్చపై శశి థరూర్ స్పందించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగకుండగా.. సీఎం ఎవరన్న చర్చ ఇప్పుడే అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..