న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: యూట్యూబ్ ఛానెల్ నిర్వహించేవారు తరచుగా ఓ రిక్వెస్ట్ పెడుతుంటారు. ‘మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్‌స్ర్కైబ్ చేయండి. షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి’ అంటూ యూట్యూబ్ ఫ్రెండ్స్‌ను అభ్యర్ధిస్తుంటారు. అయితే ఈ మాట ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంట వస్తే..! బుధవారం (సెప్టెంబర్ 27) ప్రధాని మోదీ సైతం తన యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోమని అభ్యర్ధించడం ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా మోదీ 5,000 మంది కంటెంట్ క్రియేటర్లను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. సమాచార సృష్టిలో తాను కూడా వారిలో ఒకరినని భావించడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. వారి కంటెంట్ దేశ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో తాను గమనిస్తున్నానని అన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్ ద్వారా దేశానికి, ప్రపంచానికి తాను అనుసంధానమైనట్లు ప్రధాని చెప్పారు. తనకు కూడా మంచి సంఖ్యలోనే సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 17.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు మోదీ తెలిపారు. మనమంతా కలిసి దేశ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకురావచ్చన్నారు. తన ఛానల్‌లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయన్నారు. అయితే పరీక్ష సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకత పెంపు, టైమ్ మేనేజ్‌మెంట్ వంటి విషయాలపై యూట్యూబ్ ద్వారా విద్యార్థులతో సంభాషించడం తనకు సంతృప్తినిస్తాయని అన్నారు.
ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్వచ్ఛ్ భారత్, డిజిటల్ పేమెంట్స్, ‘ఓకల్ ఫర్ లోకల్’ వంటి విషయాలపై మాట్లాడారు. ఇలాంటి ప్రచారాల్లో మరింత మందిని భాగం చేసేలా స్ఫూర్తి తీసుకురావాలని తోటి యూట్యూబర్లను మోదీ కోరారు. మన దేశ శ్రామికులు, చేతి వృత్తులు, హస్త కళలు, చేనేల కళాకారుల చేతుల్లో తయారైన.. మన నేల సువాసన తగిలిన వస్తువుల్ని కొనేలా జాతిని మేల్కొల్పే ఉద్యమాన్ని ప్రారంభించండని సమాచారం సృష్టికర్తలను ఆయన కోరారు. ఇక యూట్యూబర్లు ప్రతి వీడియో చివరిలో ప్రజలు ఆలోచించేలా ప్రశ్నలను లేవనెత్తాలని, తద్వారా ప్రజల భాగస్వామ్యం మెరుగుపడుతుందని, తమతో వాటిని పంచుకుంటారని అన్నారు. ఇలా చేయడం ద్వారా మీ ఖ్యాతి కూడా పెరుగుతుందని, ప్రజలు కేవలం వినడం మాత్రమేకాకుండా వాటిని ఆచరణలో పెడతారని అన్నారు. ఇక వీడియో చివరిలో మరిన్ని అప్డేట్ల కోసం నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయడండి. బెల్ ఐకాన్ నొక్కండి అంటూ నెటిజన్లను ప్రధాని మోదీ కోరడం విశేషం. కాగా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విశేష ఆధరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మోదీ ట్విటర్ ఖాతాలో 9.2 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారుమరి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.