
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. బిలాస్‌పూర్‌లోని ఝండుత అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్తిన్‌లో మంగళవారం (అక్టోబర్ 7) సాయంత్రం ఈ పెద్ద ప్రమాదం జరిగింది. భల్లు వంతెన సమీపంలోని కొండపై నుండి భారీ శిథిలాలు, రాళ్ళు అకస్మాత్తుగా పడి బస్సు తునాతుకలైంది. ఈ ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించగా, చాలా మంది గాయపడినట్లు సమాచారం. ఒక చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
మంగళవారం సాయంత్రం బార్తిలోని భల్లు వంతెన సమీపంలో ఒక బస్సు వెళుతోంది. దాదాపు 30 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. అకస్మాత్తుగా ఒక కొండ చరియ పగిలిపోవడంతో బస్సుపై శిథిలాలు పడ్డాయి. ప్రయాణికులు అప్రమత్తంగా కేకలు వేశారు. శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఘుమార్విన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఝండుత ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కొండ ప్రాంతాన్ని దెబ్బతీసింది. దీనివల్ల ఈ విషాదకరమైన ఘటన జరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరకుని జేసీబీ సాయంతో బస్సులోని శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో ఘుమర్విన్ ఝండుట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆరుగురు ప్రయాణికులు మరణించగా, మిగిలిన ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సమాచారం. బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. మిగతా వారి గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. మృతులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Bilaspur, Himachal Pradesh | At least 10 people were killed and several others injured after a private bus was hit by a landslide in the Balurghat area of Jhandhuta subdivision in Himachal Pradesh’s Bilaspur district. Excavation and rescue operations are continuing on a war… pic.twitter.com/1mlKWXCDkQ
— ANI (@ANI) October 7, 2025
ఈ విషాదం పట్ల ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సహాయ, సహాయ చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించాలని, వారి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి సిమ్లా నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..