Himachal Pradesh Result 2022: హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘సీట్‌ ఫైట్‌’.. క్యాంప్‌ రాజకీయాలు మొదలుపెట్టిన కాంగ్రెస్‌..!

|

Dec 08, 2022 | 11:08 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మినిట్‌ టు మినిట్‌ వెలువడుతున్న ఫలితాలతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Himachal Pradesh Result 2022: హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘సీట్‌ ఫైట్‌’.. క్యాంప్‌ రాజకీయాలు మొదలుపెట్టిన కాంగ్రెస్‌..!
Congress
Follow us on

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్‌లో బీజేపీ గత రికార్డులను బ్రేక్‌ చేసి.. ఏడోసారి అధికారం చేపట్టే దిశగా ముందుకుసాగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మినిట్‌ టు మినిట్‌ వెలువడుతున్న ఫలితాలతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకసారి కాంగ్రెస్‌కు ఆధిక్యత వస్తే.. వెంటనే బీజేపీ కూడా లీడ్‌లోకి వస్తోంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ 32, బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇరు పార్టీలు స్వల్ప ఆధిక్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ వ్యూహాలను సైతం మొదలుపెట్టింది. బీజేపీ ఆపరేషన్‌ లోటస్.. ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేలను తరలించాలని ఆలోచిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. గురువారం సాయంత్రానికి బస్సుల్లో రాజస్థాన్‌ తరలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె శిమ్లా చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం.. ఇప్పటి వరకూ ఖాతా తెరవలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..