ఎంతో మంది పిల్లుల లేక మానసికంగా కుంగిపోతుంటారు. పిల్లలు కలగాలని ఆస్పత్రుల చుట్టు తిరగడమే కాకుండా ఎన్నో పూజలు చేస్తుంటారు. కానీ కొందరు పుట్టిన పిల్లలను వదిలిపెట్టేస్తున్నారు. తాజాగా విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతి రోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్ చేస్తుంటారు. ఇక ఆలయం మెట్ల వద్ద ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్‌లో చుట్టి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
స్థానికులు వెంటనే ఆలయ పూజారి బ్రహ్మనందంకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. ఆలయం ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారి బ్రహ్మనంద్ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, ఇలాంటి ఘటన గత వారం రోజుల కిందట హిమాచల్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, మరణించింది. అలాగే మండి ప్రాంతంలో ఒక మహిళ తన ఇద్దరు ఆడ పిల్లలను మూడు నెలల కిందట వంతెనపై నుంచి విసిరిపారేసింది. వారు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు ఎంతో మందిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.