Himachal Pradesh Kangra Landslides: హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో, రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో వరదలతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకూ 9 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొంత మంది తప్పిపోయినట్లు పేర్కొంటున్నారు.
వరదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం జైరాం ఠాకూర్ ధర్మశాలను సందర్శించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందన్నారు. బోహ్ లోయలోని రుల్హద్ గ్రామంలోని చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. కాగా.. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నదని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read: