వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. కుండపోతగా కురుస్తున్న వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి.. ఎడతెగని వానలతో విలవిల్లాడుతున్నారు అసోం(Assam) వాసులు. అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కరింగంజ్‌లో కురుస్తున్న వానలతో అష్టకష్టాలు పడుతున్నారు జనం. ముంచెత్తుతున్న వరదలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాహనాలు బయటకు తీయలేని దుస్థితి నెలకొంది. పలుచోట్ల వాహనాలు నీళ్లల్లో మునిగిపోయాయి. వరదలో పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారీ వర్షాలతో కరింగంజ్ ప్రాంతంలోని ఇళ్లన్నీ జలమయంగా మారాయి. ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సగం నీట మునిగిన ఇళ్లల్లో ఉండలేని పరిస్థితులు దాపురించాయి. మోకాళ్ల లోతు నీళ్లల్లో అవస్థలు పడుతున్నారు జనం. వరద నీటితో పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉండేందుకు ఇళ్లు లేక.. తిండి లేక నరకయాతన పడుతున్నారు కరింగంజ్ ప్రాంత వాసులు.
కుంభవృష్టి వానలతో చెరువు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోయి వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. చెక్‌డ్యాంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ నిండి అలుగు పోస్తుండడంతో స్థానికులు భయం.. భయంగా జీవిస్తున్నారు. మరోవైపు.. పంట పొలాల్లో వరద నీరు వచ్చి చేరింది. వరదతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. వేసిన పంటకు కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పంట పొలాలన్నీ జలమయంగా మారాయి. వరదతో పంట నష్టపోయిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తంగా అసోం వరదలతో 90 వేల మంది ప్రభావితులయ్యారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. ఇటు.. ముంబైలోనూ వానలు పడుతున్నాయి. ఏకధాటి వానలతో ముంబై రోడ్లపై వాన నీరు నిలుస్తోంది. వర్షంలో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి