త్వరలో మనదేశంలో అడుగు పెట్టబోతున్న 5 జీ టెక్నాలజీపై భయాందోళనలు నెలకొంటున్నాయి.. ప్రజల ఆరోగ్యంపై ఈ సాంకేతికత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, పర్యావరణానికి హాని చేస్తుందని చాలా మంది భయపడుతుననారు. బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా అయితే ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జడ్డి విపరీతంగా కోపం తెచ్చుకున్నారు.. అదెవరి మీద అంటే జూహీ వీరాభిమాని మీద.. ఎందుకూ అంటే అతడు చేసిన ఓ తుంటరి పని..
5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా జూహీ చావ్లాతో పాటు వీరేశ్ మాలిక్, టీనా వాచ్ఛానీ అనే ఇద్దరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జూహీచావ్లా విదేశాల్లో ఉండటంతో కోర్టు విచారణకు ఆమె స్వయంగా హాజరుకాలేకపోయారు. ఆ కారణంగా వర్చువల్ విచారణ జరిగింది. అయితే అంతకంటే ముందే ఆమె కోర్టు వర్చువల్ విచారణ లింక్‌ను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదే ఆమె చేసిన తప్పు.
జూహీ తరఫున న్యాయవాది దీపక్ ఖోస్లా వాదనలు వినిపిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి సీన్‌లో ఎంటరయ్యారు. లాల్ లాల్ హోటోంపర్ గోరీ కిస్కా నామ్ హై అంటూ పాట అందుకున్నాడు. దీంతో చిరాకు పడిన న్యాయమూర్తి ..గమ్మునుంటే ఉండు..లేకపోతే విచారణ నుంచి బైటికెళ్లు అని కోపగించుకున్నారు. మనవాడు వింటేగా… కాసేపటికి మేరి బన్నోకి ఆయేగి బారాత్ అంటూ మరో పాటెత్తుకున్నాడు. దీంతో విచారణకు మళ్లీ బ్రేక్ పడింది.. ఈసారి న్యాయమూర్తి జస్టిస్ మిథాకు పట్టరాని కోపం వచ్చేసింది. ఇలా మాటిమాటికి మధ్యలో దూరుతూ పాటలు పాడుతున్న వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉంటాడో వెంటనే కనుక్కోమని సిబ్బందిని ఆదేశించారు. అతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కోర్టు ధిక్కారం కింద నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
కోర్టు విచారణకు ఇలా అంతరాయం కలిగించకూడదని పాపం అతగాడికి తెలియనట్టు ఉంది. పైగా కపిల్ సిబాల్ వంటి గొప్ప న్యాయవాదులు పాల్గొన్న విచారణకు బ్రేక్‌లు వేయకూడదన్న ఇంగితం లేకపోవడంతోనే ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసలు ఆ జూహీ అభిమాని మొదటి నుంచే విచారణకు అడ్డు తగిలాడట. జూహీ మేడమ్ ఎక్కడ, అమె డైహార్డ్ ఫ్యాన్‌ను నేను, నాకు ఆమె కనిపించడం లేదు.. వంటి సిల్లీ కామెంట్లతో బాగా విసిగించాడట!
కోర్టు వర్చువల్ విచారణలో పాట పాడిన ఆ జూహీ అభిమాని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే అతడి ప్రహసనంపై నటి స్వరభాస్కర్ స్పందించారు. ఇది నా దేశం, ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నా, ఈ విచారణను మొదటి నుంచి చివరి వరకు ఆస్వాదించా అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు స్వరభాస్కర్.
మరిన్ని ఇక్కడ చూడండి: Protem Chairman: శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
APSRTC: కీలక ప్రకటన విడుదల చేసిన ఏపీఎస్ఆర్టీసీ.. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకై..