Gyanvapi Masjid Case: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నిరుద్యోగం, ధరాఘాతం తదితర కీలక సమస్యలపై దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే కాశీ జ్ఞానవాపి మసీదు వివాదాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన మాయావతి.. ఓ వర్గం, ఆధ్యాత్మిక స్థలాలను టార్గెట్ చేస్తూ బీజేపీ రాజకీయ పబ్బం గడపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎత్తుగడ అందరికీ తెలిసిందేనన్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశముందన్నారు. కుట్రపూరితంగానే మత ప్రాతిపదికన ప్రజల మధ్య చీలిక తెస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. జ్ఞానవాపి, మధుర, తాజ్ మహల్, ఇతర ప్రాంతాలపై వివాదాలు చెలరేగడం దేశాన్ని బలోపేతం చేయబోదన్నారు. ఈ అంశాన్ని బీజేపీ గ్రహిస్తే మంచిదని మాయావతి హితవు పలికారు.
మత రాజకీయాల కోసమే దేశంలోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా బీజేపీ మార్చుతోందని మాయావతి ఆరోపించారు. తద్వారా మత ధ్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య మత సామరస్యం, సోదరత్వాన్ని తగ్గిస్తూ.. ధ్వేషాన్ని పెంచడం తగదన్నారు. దేశంలో ఇది ఆందోళనకర పోకడగా పేర్కొన్నారు.
Mayawati
బీజేపీ ఎత్తుగడలు, కుట్రల పట్ల అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇది దేశానికి, దేశ సామాన్యులకు మేలు చేయదని గ్రహించాలని మాయావతి కోరారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..