ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే.. ఉర్లో ఉండనీయరు అన్నది వెనకటికి ఓ సామెత..అయితే, ఇక్కడ ఈ సామెత అక్షరాల నిజమైంది. ఎందుకంటే..ఓ కుక్కని కుక్కా అన్నందుకు పెద్ద యుద్ధమే జరిగింది. ఏకంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణతో తలలు పగలగొట్టుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని జ్యోతిపార్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానికి ముద్దుగా టామీ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. దీంతో కోపం వచ్చిన కొందరు స్థానికులు కుక్క యజమానిని నిలదీశారు. కుక్కను చైన్‌కి కట్టేయొచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని కంప్లైట్ చేశాడు. అంతే ‘మా టామీనీ కుక్క అని పిలుస్తావా..? నీకెంత ధైర్యం’ అంటూ రెచ్చిపోయారు. కంప్లైట్ చేసిన వ్యక్తిపై దారుణంగా దాడికి దిగారు. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. పాపం బాధితుడి కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయలతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
వీధిలో జరిగిన గొడవను స్థానికులు కొందరు వీడియో తీశారు. అదంతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో విషయం కాస్త వైరల్ గా మారింది. ప్రజలంతా కరోనాతో అల్లాడిపోతుంటే..వీళ్లు మాత్రం కుక్క కోసం తలలు పగిలేలా కొట్టుకోవడం ఏంటని గురుగ్రామ్ పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణపై మండిపడుతున్నారు. కుక్కని కుక్కా అనకూడదా..? అంతమాత్రానికే తలలు పగలగొట్టలా అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఏడాదిలో ఎప్పుడైనా తిరుమల వెంకన్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!