Gujarat Civil Code: గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉమ్మడి పౌరస్మృతి, సివిల్ అమలుకు కమిటీ..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి ..యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనుంది.

Gujarat Civil Code: గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉమ్మడి పౌరస్మృతి, సివిల్ అమలుకు కమిటీ..
Gujarat Chief Minister Bhupendra Patel

Updated on: Oct 29, 2022 | 9:58 PM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి ..యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌ కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుందని తెలిపారు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌. గతంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్ ధామి యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం కూడా ఈవిషయంలో నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

గోవాలో ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. పోర్చుగీస్‌ సివిల్‌ కోడ్‌, 1867ను గోవా అనుసరిస్తోంది. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చట్టం అమల్లో ఉంటుంది. హిందూ వివాహ చట్టం, 1955, హిందూ వారసత్వ చట్టం 1956 లేదా భారత వారసత్వ చట్టం 1925, షరియత్‌ చట్టం, 1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు. అయితే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిపుణులు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా, గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని మజ్లిస్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ తప్పుపట్టారు. రాజ్యాంగం ఇచ్చిన ముస్లిం పర్సనల్‌ లా అమలు కాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఒవైసీ ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..