Hardik Patel: బీజేపీ వైపు హార్ధిక్ పటేల్ చూపు..? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన గుజరాత్ కాంగ్రెస్ నేత
Gujarat Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గుజరాత్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. పటీదార్ ఆందోళన్ నాయకుడు హార్ధిక్ పటేల్..
Gujarat Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గుజరాత్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. పటీదార్ ఆందోళన్ నాయకుడు, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్(Hardik Patel) చుట్టూ ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఆయన రగిలిపోతున్నారు. తన అసమ్మతిని బాహటంగానే వెళ్లగక్కడం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతటితో ఆగకుండా బీజేపీ ఎంటే ఎప్పుడూ ఒంటికాలిపై లేచే ఆయన స్వరంలో మార్పు రావడం కూడా రాజకీయ కాక రేపుతోంది. ఇటీవల కాలంగా బీజేపీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు బాగున్నాయంటూ హార్ధిక్ పటేల్ బహిరంగ ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్‌లో కలకలం మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరిపోవచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు వెలువడుతున్న కథనాలపై హార్ధిక్ పటేల్ స్పందించారు. ఈ పుకార్లపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు. అదే సమయంలో ఇటీవల కాలంలో బీజేపీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటే తాను తప్పకుండా స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు హార్ధిక్ పటేల్ వెల్లడించారు. వీటి పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలను తన దారిలోకి తెచ్చుకునేందుకే.. వ్యూహాత్మకంగా బీజేపీని మెచ్చుకుంటూ హార్ధిక్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించే విషయంలో పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ దక్కకుంటే.. ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది.
త్రిముఖ పోటీ..
గుజరాత్‌లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ఇటీవల పంజాబ్‌లోనూ అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో రాష్ట్రం గుజరాత్‌లోనూ అధికారాన్ని సొంతం చేసుకుని బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ వ్యూహరచనలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుంది.
డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంఐఎం కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.