
ఢిల్లీ శివార్ల లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. నిక్కీ అనే మహిళను అదనపు కట్నం కోసం భర్త , అత్త హింసించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 35 లక్షల కట్నం తేవాలని నిక్కీని అత్తింటివాళ్లు చాలా రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నరని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిక్కీని చిత్రహింసలకు గురి చేసిన తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది చూసిన ఆమె కుమారుడు తన తల్లిని కాపాడాలని గట్టిగా అరిచాడు.
నిక్కీ బంధువుల భారీ ఆందోళన
తమకు న్యాయం కావాలని నిక్కీ బంధువులు భారీ ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇప్పటికే నిక్కీ భర్త విపిన్‌ను అరెస్ట్ చేశారు. అత్తతో పాటు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిక్కీ వివాహం 2016లో నోయిడా లోని సిర్సా గ్రామానికి చెందిన విపిన్‌తో జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చారు. అయినప్పటికి నిక్కీకి వేధింపులు ఆగలేదు. మరో 35 లక్షలు తేవాలని భర్త విపిన్‌తో పాటు అత్త , ఇతర బంధువులు ప్రతి రోజు వేధించారు.
నిక్కీ కుమారుడి ముందే ఈ దారుణం జరిగింది. డాడీ తన మమ్మీని కొట్టి , కాల్చి చంపాడని పోలీసులకు వెల్లడించాడు ఆ బాలుడు. నిక్కీ సోదరిని కాంచన్‌ను కూడా విపిన్ సమీప బంధువునే పెళ్లాడింది. ప్రతి రోజు తన చెల్లెలిని అదనపు కట్నం కోసం హింసించారని కాంచర్ ఆరోపించారు. నిక్కీని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. తీవ్రగాయాల పాలైన నిక్కీని ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా దారి లోనే చనిపోయారు.
“కాస్నా ప్రాంతం నుంచి ఓ మహిళను తీవ్రగాయాలతో సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు సమాచారం అందింది. కాని ఆమె దారి లోనే చనిపోయారు. పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. భర్త , అత్తపై కేసు నమోదు చేశాం. భర్త విపిన్‌ను అరెస్ట్ చేశాం. మిగతా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తాం” అని నోయిడా ఏడీసీపీ సుధీర్‌కుమార్ తెలిపారు.
నిక్కీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ తరువాత బంధువులకు అప్పగించారు. వాళ్లు అంత్యక్రియలను నిర్వహించారు. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..