విపక్షాల ఐక్యతకు మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థిపై క్లారిటీ రావడం లేదు. నిన్నటి వరకు సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా, మొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపంచింది. వారంతా నో చెప్పగా.. ఇప్పుడు మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు నిరాకరించారు. ఉమ్మడి ప్రతిపక్షం తరపున తన పేరును అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపక్షాల నుంచి నా కంటే మెరుగైన రాష్ట్రపతి అభ్యర్థిగా మరొకరి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో జాతీయ ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థిని నియమించాలని, ప్రతిపక్షాల ఐక్యతను నిర్ధారించాలన్నారు. అందుకే అలాంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని ప్రతిపక్ష నేతలకు విన్నవించారు. బ్రిటీష్ చివరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన రాజాజీ (సి.రాజగోపాలాచారి) వంటివారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కోరారు. అంతేకాదు మొదట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత అలంకరించబడిన పదవి అది అంటూ సున్నితంగా తిరస్కరించారు.
మాజీ బ్యూరోక్రాట్ గోపాలకృష్ణ గాంధీ దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు భారత హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పనిచేశారు. గోపాలకృష్ణ మహాత్మా గాంధీ మునిమనవడు, సి రాజగోపాలాచారి మునిమనవడు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ఆ తర్వాత..
తదుపరి రాష్ట్రపతి పదవి ఎన్నిక కోసం ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా ముందుగా ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ పేరు వినిపించింది. అయితే కానీ ఆయన తాను పోటీ చేయబోనని స్పష్టంచేశారు. ఓడిపోతామని తెలిసీ కూడా.. బరిలో నిలువడం ఎందుకు అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తెరపైకి సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా పేరు వచ్చింది. కానీ ఆయన కూడా నో అన్నారు. ఆ తర్వాత గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారు. మరీ విపక్షాల నుంచి ఎవరూ బరిలో నిలువనున్నారో తెలియడం లేదు.