ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో , సినిమా థియేటర్లలో , హోర్డింగుల్లో ఆఖరికి కాల్చే సిగరెట్ పెట్టెల పైన ముద్రించి హెచ్చిరస్తుంటారు. అయినా కూడా ఒక్కరూ పట్టించుకోవడం లేదు . అందుకే ధూమపానాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేయనుంది. ఇప్పటికే ధూమపానాన్ని అరికట్టేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ పలు చర్యలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఎటువంటి మార్పు రాకపోవడంతో ఇప్పుడు మరో నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సింగిల్ సిగరెట్ విక్రయాలపై త్వరలో నిషేధం విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, సింగిల్ సిగరెట్ల విక్రయం, తయారీని పార్లమెంటు త్వరలో నిషేధించే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన విషయం గుర్తుండే ఉంటుంది. జిఎస్‌టి అమలులోకి వచ్చినప్పటికీ పొగాకు ఉత్పత్తులపై పన్ను గణనీయంగా పెరగలేదని స్టాండింగ్ కమిటీ గమనించింది. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ప్యానెల్ హైలైట్ చేసింది. తాజా పన్ను శ్లాబ్‌ల ప్రకారం దేశంలో బీడీలపై 22శాతం, సిగరెట్లపై 53శాతం, పొగలేని పొగాకుపై 64శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
వివిధ నివేదికల ప్రకారం..సిగరెట్ తాగడం వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది మరణిస్తున్నారు. 2018లో, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసిన సర్వేలో 46శాతం ధూమపానం చేసేవారు నిరక్షరాస్యులు, 16శాతం మంది కాలేజీకి వెళ్లే విద్యార్థులే ఉన్నట్టుగా సర్వేలో తేలింది.
ఫౌండేషన్ ఫర్ ఎ స్మోక్-ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారని తేలింది. అయితే 26 కోట్ల మంది ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 21శాతం మంది ప్రజలు పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు.
భారతదేశంలో ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది. నిబంధనను ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా అమల్లో ఉంది. పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను కూడా ప్రభుత్వం నిషేధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి