Edible Oils: వంట నూనె కొనేటప్పుడు నూనె అసలు పరిమాణం ఎంతో తెలుసుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. మనం లీటర్ ప్యాకెట్ కొంటే దానిపై 950 మి.లీ లేదా 900 ఎం.ఎల్ అని ఉంటుంది. మనం చూసుకోకుండా కొనుగోలు చేస్తాం. ఒక్కోసారి నూనె పరిమాణం మాత్రమే కాకుండా ప్యాకింగ్ కవర్ పరిమాణాన్ని కలిపి వెయిట్ గా ముద్రిస్తారు. అలాగే ఆయిల్ యొక్క ముడిపదార్థాలను మరిగించినప్పుడు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో పరిమాణంలో నూనె అసలు బరువు ఉంటుంది. అయితే ప్యాకింగ్ లేబుల్ పై నూనె అసలు పరిమాణాన్ని ముద్రించకుండా ఒక లీటర్ గా పేర్కొంటూ దానిని ఎంత ఉష్ణోగ్రత వద్ద మరిగించారో పేర్కొంటున్నారు. దీంతో ప్యాకెట్ లేదా సీసా లోపల ఉన్న నూనె పరిమాణం ఎంతో తెలుసుకోవడంలో వినియోగాదారుడు ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఇలాంటి మోసాలను నివారించడానికి కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇక నుంచి ఉష్ణోగ్రత లేకుండా వాల్యూమ్‌లో నికర పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్రప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులకు సూచించింది. ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు, ప్యాకర్లు వంట నూనె మొత్తం బరువును ప్రకటించడంతోపాటు ఉష్ణోగ్రత లేకుండా వాల్యూమ్‌లో నికర పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సూచించింది. కొత్త నిబంధనల ప్రకారం వంటనూనె లేబులింగ్ ను వచ్చే ఏడాది జనవరి 15లోపు సరిచేసుకోవాలని వంట నూనె తయారీ దారులు, ప్యాకర్లకు ఆదేశాలు జారీచేసింది. వివిధ ఉష్ణోగ్రతల వద్ద నూనె బరువు భిన్నంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల, వినియోగదారుడు ప్యాకేజీలో సరైన పరిమాణాన్ని పొందారని నిర్ధారించుకోవడానికి, ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు ఉష్ణోగ్రతను పేర్కొనకుండా ఉత్పత్తులను ప్యాక్ చేయాలని సూచించింది. వాల్యూమ్ మరియు ద్రవ్యరాశిలో ప్యాకేజీపై ప్రకటించిన పరిమాణం సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కొత్తగా జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారం బరువు లేదా కొలత యొక్క ప్రామాణిక యూనిట్ల పరంగా నికర పరిమాణాన్ని ప్రకటించడం తప్పనిసరని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రప్రభుత్వం జారీచేసిన కీలక ఆదేశాలతో వంట నూనె ప్యాకింగ్ లో అవకతవకలకు చెక్ పడనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..