రాజస్తాన్ లోని జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్లే హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమదం జరిగింది. ఉదయం 6 గంటల సమయం కావడంతో రద్దీ తక్కువగా ఉంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా కిలోమీటరు మేర మంటలు చెలరేగాయి. అక్కడ ఏమి జరిగిందో అర్ధం అయ్యే సరికే మంటలు చాలా వాహనాలకు వ్యాపించాయి. అంతేకాదు ఆ మంటలు రోడ్డు పక్కన ఉన్న ఫ్యాక్టరీని చుట్టుముట్టాయి. కొద్దిసేపటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో హాహాకార కేకలు మిన్నంటాయి.
ఏం జరిగిందో జనాలకు అర్థమయ్యే సరికే ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. కార్లలో కూర్చున్న వారు క్షణాల్లోనే దగ్ధం అయ్యారు. క్రమంగా హైవేపై వెళ్లే వాహనాలకు ఈ అగ్ని వ్యాపించింది. అసలు మంటలు ఎలా చెలరేగాయి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరు తమ ప్రాణాలు కాపాడుకునే పనిలో పడ్డారు. ఎలాగోలా పోలీసు అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రమాదం గురించి సమాచారం అందించారు. రంగంలోకి దిగన సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు.
వాస్తవానికి జైపూర్-అజ్మీర్ హైవేపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు.. LPG నింపిన ట్యాంకర్ అజ్మీర్ నుంచి జైపూర్ వైపు వస్తోంది. ఈ క్రమంలో ట్యాంకర్ యూ టర్న్ తీసుకుంది. కొన్ని వాహనాలు నిలిచి దారి కోసం చూస్తున్నాయి. ఇంతలో జైపూర్ నుంచి లోడ్‌తో కూడిన లారీ వస్తూ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. లారీ ఢీ కొనడం వల్ల ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైంది. గ్యాస్ ద్రవ రూపంలో లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. గ్యాస్ వేగంగా వ్యాపించడంతో మంటలు కూడా అంతే వేగంగా వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతమంతా మంటలు చుట్టుముట్టాయి.
జైపూర్-అజ్మీర్ హైవేపై కొన్ని సెకన్ల వ్యవధిలో మంటలు ఒక్కొక్కటిగా 40 కార్లను చుట్టుముట్టడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. తొలుత 200 మీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించగా, తర్వాత దాదాపు కిలోమీటరు మేర మంటలు వ్యాపించాయి. వాహనాల్లో కూర్చున్న వ్యక్తులు వాహనాల తలుపులు తెరిచి పరుగులు తీశారు. రోడ్డు పక్కన నిర్మించిన పైపుల ఫ్యాక్టరీకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ముడి చమురు పైప్‌లైన్ వెళుతోంది.
ఈ ప్రమాదంలో కాలిపోయిన 32 మందిని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో చేర్చినట్లు వైద్యులు తెలిపారు. 5 మందిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 5 మంది మృతి చెందారు. 50 శాతానికి పైగా కాలిన గాయాలతో బాధపడుతున్న 32 మంది రోగులలో 15 మంది ఉన్నారు. జైపురియా ఆస్పత్రిలో ఓ రోగి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది చనిపోయారని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..