
బేడీలతో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు. పటిష్టమైన పోలీస్ కస్టడీ. 17 మంది పోలీసుల రక్షణ. చుట్టూ కెమెరాలతో మీడియా.
కొందరు మీడియా వారు మైక్‌లతో ముందుకెళ్లారు. అతిక్‌ని ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు. నటోరియస్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ ఏదో చెప్పబోయాడు. ఇంతలోనే ఓ ఆగంతకుడు వచ్చి అతిక్ తలకి గన్ గురిపెట్టి కాల్చేశాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి జరిపిన కాల్పుల్లో బులెట్ అతిక్ అహ్మద్ తలలోంచి దూసుకెళ్లడం అక్కడికక్కడే కుప్పకూలాడు. ఒక్కసారిగా షాక్. పోలీసులకు ఏం జరుగుతోందో తెలియలేదు. మీడియా ప్రతినిధులు భయాందోళనలకు గురయ్యారు.
అతిక్ తేరుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఈలోపు మరో ఇద్దరు దుండగులు తమతో తెచ్చుకున్న గన్నులు తీసి కాల్చేశారు. ముగ్గురు షూటర్లు, ఒక్కొక్కరు గన్‌లోని మ్యాగజీన్లు అయిపోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
ఒక్కో బుల్లెట్ ఇద్దరు గ్యాంగ్‌స్టర్ అన్నాదమ్ముల శరీరాలను చిద్రం చేసుకుంటూ వెళ్తున్నాయి. అంతా ముప్పై సెకన్లలోనే జరిగిపోయింది.
తమ గన్నుల్లో బులెట్లు అయిపోయినా.. ట్రిగ్గర్లు నొక్కుతూనే ఉన్నారు ఆ దుండగులు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని పట్టుకున్నారు. ఎప్పుడైతే అతిక్ అహ్మద్ చనిపోయాడని నిర్ధారించుకున్నారో.. ముగ్గురూ చేతులెత్తి లొంగిపోయేందుకు సిద్ధపడ్డారు. ముగ్గుర్నీ పట్టుకుని స్టేషన్‌కి తరలించారు పోలీసులు. అయితే అతిక్ బ్రదర్స్‌ని చంపిన తర్వాత ఆ ముగ్గురు షూటర్లూ కొన్ని నినాదాలు చేయడమే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.
భారత దేశ చరిత్రలో తొలిసారి ఇలాంటి మర్డర్ చూస్తున్నాం. మీడియా కెమెరాలున్నాయన్న భయం లేదు. పోలీసులున్నారన్న బెరుకు లేదు. నడిరోడ్డుపై దాడికి పాల్పడుతున్నామన్న సంకోచం ఏమాత్రం కూడా కనిపించలేదు. తమ టార్గెట్‌ని టెర్మినేట్ చేయడమే పనిగా పెట్టుకుని.. అదను చూసి దెబ్బకొట్టారు. ఆ ముగ్గురు దుండగులు లవ్లేష్ తివారీ, సోను, అరుణ్ మౌర్యగా గుర్తించారు పోలీసులు.
నటోరియస్ క్రిమినల్స్ అతిక్ అహ్మద్ అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ని కాల్చి చంపే సమయంలో ఆ ముగ్గురిలో ఏమాత్రం జంకు, భయం లేదు. ఏళ్ల నాటి పగతో చంపినట్లు కనిపించింది. అత్యాధునిక పిస్టల్స్‌ను తమతో తీసుకొచ్చుకున్నారు. వాటిని బ్యాకుల్లో పెట్టుకున్నారు. మీడియా రిపోర్టర్, కెమెరామ్యాన్, అసిస్టంట్‌లా వచ్చారు. ఓ ఫేక్ మైక్‌ని పట్టుకున్నాడో దుండగుడు. మీడియా ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను అనుసరిస్తూ ప్రశ్నలు అడుగుతూ ముందుకెళ్తున్న సమయంలో.. బ్యాక్‌లో నుంచి గన్నులు తీసి భీకరంగా కాల్పులు జరిపారు. పదిహేను రౌండ్ల వరకు సౌండ్లు రికార్డయ్యాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు అన్నాదమ్ములు హతమవడమే కాదు.. ఓ మీడియా ప్రతినిధితోపాటు.. మరో కానిస్టేబుల్‌కి బులెట్ గాయాలయ్యాయి. ముగ్గురు మూడు వైపుల నుంచి కాలుస్తూ కొద్ది క్షణాలపాటు రణరంగమే సృష్టించారు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ఇప్పటివరకు చూసి ఉండదరు. లైవ్ మర్డర్. బులెట్ ఫైరింగ్. గన్నుల నుంచి నిప్పు రవ్వలు చిందడం.. ఇవన్నీ మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇద్దరు నరహంతకులు తమ జీవితకాలం ఎలాంటి మర్డర్లు చేశారో.. అదే విధంగా అంతమయ్యారు.
ఘటన జరగ్గానే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎస్, డీజీపీ, ఏడీజీతోపాటు.. టాప్ అఫీషియల్స్‌ను పిలిపించారు. వెంటనే ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్‌ని అమలులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో అతిక్ బ్రదర్స్‌కి రక్షణగా ఉన్న 17మంది పోలీసులపై వేటు వేశారు. అందర్నీ సస్పెండ్ చేశారు. మరిన్ని బలగాలను ప్రయాగ్‌రాజ్‌కి పంపించారు. ప్రయాగ్‌రాజ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించడమే కాదు.. ఇంటర్నెట్ ఆపేశారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు క్రిటికల్ ఏరియాల్లో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
అటు సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ప్రయాగ్‌రాజ్ పంపించారు. డీజీపీతోపాటు.. టాప్ పోలీసు అధికారులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. సీఎస్ ఎప్పటికపుడు పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి అలజడులు చెలరేగకుండా చూస్తున్నారు. పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు.
ఇక ఘటనపై వెంటనే స్పందించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. పోలీస్ కస్టడీలో ఉన్నవారిని చంపడం.. వెంటనే కొన్ని రకాల స్లోగన్స్ చేయడం యోగీ ప్రభుత్వ వైఫల్యమన్నారు అసదుద్దీన్. ఎన్‌కౌంటర్లను ఎవరైతే సమర్థించారో.. ఈ హత్యలకు బాధ్యత వహించాలన్నారు అసదుద్దీన్.
యోగీ హయాంలో క్రైమ్ పీక్స్‌కు చేరుకుందన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. పోలీస్ రక్షణలో ఉన్న వ్యక్తుల్నే కాల్చిచంపుతుంటే.. యూపీలో సాధారణ ప్రజల రక్షణ విషయమేంటని ప్రశ్నించారు. ఇలాంటి హత్యల వల్ల ప్రజల్లో మరింత అభద్రత పెరుగుతుందని.. కొందమంది కావాలనే ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం