PM Modi – G20: ఇవాళ ఇండోనేషియాకు ప్రధాని మోడీ.. జీ-20 సదస్సులో బ్రిటన్ పీఎం రిషి సునాక్‌తో భేటీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
PM Modi – G20: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ-20 సదస్సులో భాగంగా రెండురోజులపాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు కోసం ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటన కోసం ప్రధాని మోడీ సోమవారం బాలీకి బయలుదేరనున్నారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచ అధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బిజీబిజీగా కొనసాగే టూర్‌లో.. ప్రధాని మోడీ బాలీ ద్వీపంలో సుమారు 45గంటలపాటు ఉండనున్నారు. ఈ సందర్భంగా మోడీ దాదాపు 20 భేటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోడీ బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ హెల్త్ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలపై మోదీతోపాటు ఇతర నేతలు చర్చిస్తారని అన్నారు. దీంతోపాటు ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది.
G20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్స్‌లర్ ఓలఫ్ షోల్జ్‌తోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 నిర్వహణ బాధ్యతలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించనుంది. దీనికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..