అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మహారాష్ట్ర హోం మంత్రిపై మాజీ సీపీ షాకింగ్ ఆరోపణలు
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో షాకింగ్ ట్విస్ట్ ! మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పైనే మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో షాకింగ్ ట్విస్ట్ ! మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పైనే మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖలో ఆయన.. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర హోటళ్ల నుంచి ప్రతి నెలా 100 కోట్ల రూపాయలను వసూలు చేయవలసిందిగా మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని తెలిపారు. అనిల్ దేశ్ ముఖ్ ని వాజే అనేకసార్లు ఆయన కార్యాలయంలో కలిసేవారని, ఒక విధంగా వాజేకి అనిల్ ఈ వంద కోట్ల టార్గెట్ ని నిర్దేశించారని పరమ్ బీర్ సింగ్ ఈ లేఖలో పేర్కొన్నారు. ముంబైలో 1750 కి పైగా బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలు ఉన్నాయని, వీటిలో ప్రతి దాని నుంచి రెండు మూడు లక్షలు వసూలు చేస్తే నెలకు 40 నుంచి 50 కోట్లు వస్తాయని, ఇతర మార్గాల ద్వారా మిగతా మొత్తాన్ని సేకరించవచ్చునన్నారు .
తను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తోను, ఇతర మంత్రులతోనూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ కూడా కలిసేవాడినని, వీరిలో కొంతమందికి ఈ విషయాల గురించి ఇదివరకే తెలుసునని పరమ్ బీర్ సింగ్ అన్నారు. ఒకప్పుడు నగర క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ హెడ్ గా ఉన్న సచిన్ వాజే ని అనిల్ దేశ్ ముఖ్ గత కొన్ని నెలల్లో తన అధికార నివాసానికి ఎన్నోసార్లు పిలిపించుకునే వారని ఆయన తెలిపారు. వాజే అదే రోజున తనను కలిసి అన్ని విషయాలూ చెప్పారని ఆయన వెల్లడించారు. పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తనకు తెలియలేదన్నారు. ‘నన్ను పక్కన బెట్టి అనిల్ దేశ్ ముఖ్ పలుమార్లు ఇతర పోలీసు అధికారులను పిలిపించుకునేవారు. తన ఆదేశాల మేరకు వారికి టార్గెట్లు విధించేవారు’ అని సింగ్ పేర్కొన్నారు.
కాగా అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్ గల వాహనం కనబడిన కేసులో అప్పటి నగర పోలీసు కమిషనర్ గా ఉన్న పరం బీర్ సింగ్ ని ప్రభుత్వం హోమ్ గార్డ్స్ విభాగానికి బదిలీ చేసి ఆయన స్థానే హేమంత్ నాగ్రాలే ను నియమించింది.
ఈ సంచలన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలనీ బీజేపీ డిమాండ్ చేసింది. ఈయన అసలైన బలవంతపు వసూళ్లవాదిగా ఈ పార్టీ నేత కిరిత్ సోమయ్య అభివర్ణించారు. ఆయనకు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అటు అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఊహాగానాలను ఆయన ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారాలన్నారు.
Former Mumbai Police Commissioner Param Bir Singh writes to Maharashtra CM Uddhav Thackeray claiming Home Minister Anil Deshmukh’s involvement in severe “malpractices”.
“HM Deshmukh expressed to Sachin Waze that he had a target to accumulate Rs 100 cr/month,” letter reads pic.twitter.com/g6gSIaKIww
— ANI (@ANI) March 20, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మహారాష్ట్ర హోం మంత్రిపై మాజీ సీపీ షాకింగ్ ఆరోపణలు
Coronavirus: మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులను వెంటాడుతున్న కరోనా.. మంత్రి ఆదిత్య ఠాక్రేకు పాజిటివ్