
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఎపిసోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీని వీడడం.. కొత్త పార్టీ వైపు అడుగులు వేయడం చకచకా జరిగిపోయాయి. అయితే అందరిలాగా ఒక పార్టీని ప్రకటించేసి, ఆ తర్వాత జనాన్ని చూసుకోవడం కాకుండా అన్నామలై ఎవరూ ఊహించని ఒక వినూత్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తొలి ప్రయత్నంలోనే సీఎం పీఠాన్ని దక్కించుకున్న దళపతి విజయ్ రూట్‌ను అన్నామలై ఫాలో అవుతున్నారా? లేక తనదైన సరికొత్త పంథాతో ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా అక్కడ డీఎంకే , అన్నాడీఎంకే అనే రెండు బలమైన ద్రవిడ పార్టీలదే ఏకఛత్రాధిపత్యం. కానీ ఈ రెండు పార్టీలను కాదని, కొత్తగా పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్‌కు జనం పట్టం కట్టడం వెనుక జెన్ జీ ఓటర్ల ఆలోచనలే కారణమని స్పష్టమవుతోంది. ఈ మారుతున్న కాలానికి తగ్గట్టుగా యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అన్నామలై తన కొత్త పొలిటికల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఆయనకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు కూడా ఉందనే గట్టి ప్రచారం తమిళనాట సాగుతోంది.
గతంలో అన్నాడీఎంకే ఒత్తిడికి లొంగి అన్నామలైను పక్కన పెట్టాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. కానీ అది పార్టీకి ఎంత పెద్ద నష్టమో తర్వాత గానీ అర్థం కాలేదు. 2024 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏకంగా 12 శాతం ఓట్లు వచ్చాయి. అదే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేవలం 3 శాతానికే పరిమితమైంది. ఈ ఓటు బ్యాంక్ బలాన్ని, యువతలో తనకు ఉన్న క్రేజ్‌ను గమనించిన అన్నామలై.. ఢిల్లీ పెద్దలతో జరిగిన చర్చల్లో ఎక్కడా మెత్తబడకుండా సొంత పార్టీ వైపే మొగ్గు చూపారు.
నటుడు విజయ్ రాజకీయాల్లోకి రాకముందే దాదాపు 8 ఏళ్ల పాటు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో గ్రౌండ్ లెవెల్‌లో కేడర్‌ను బలంగా తయారు చేసుకున్నారు. అదే ఆయనకు తొలి ఎన్నికల్లోనే గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు అన్నామలై అంతకంటే ఒక అడుగు ముందుకు వేశారు. అన్నామలై తాజాగా వి ఆర్ ద లీడర్స్ పేరుతో ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా క్షేత్రస్థాయి లీడర్లకు పక్కాగా శిక్షణ ఇస్తారు. ప్రజలకు మంచి చేయాలంటే ఒక లీడర్‌కు ఎలాంటి లక్షణాలు ఉండాలి? ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి? అనే ఒక 10 ముఖ్యమైన అంశాలపై ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణలో పాస్ అయ్యి, ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే సంఘంలో సభ్యత్వం ఇస్తారు. వీరంతా రేపు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి అన్నామలై సిద్ధాంతాలను ప్రచారం చేస్తారు.
తమిళనాడులో అటు సినీ గ్లామర్‌కు ఏమాత్రం తీసిపోని క్రేజ్ అన్నామలైకు యూత్‌లో ఉంది. దీనికి తోడు అక్కడి హిందూ ఓటర్లలో కూడా ఆయనపై గట్టి నమ్మకం ఉంది. తమిళనాడులో బీజేపీకి ఇకపై ఎలాంటి అవకాశాలు లేవని తేలిపోయిన ఈ సందర్భంలో తనకున్న క్రేజ్, హిందూ ఓటు బ్యాంక్, వి ఆర్ ద లీడర్స్ కేడర్‌తో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన మార్క్ చూపించేందుకు అన్నామలై పక్కాగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ద్రవిడ కోటను బద్దలు కొట్టడానికి మాజీ ఐపీఎస్ వేస్తున్న ఈ స్కెచ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.