కర్ణాటకలోని మైసూర్‌లో రిటైర్డ్ ఐబీ అధికారి దారుణహత్య తీవ్ర కలకలం రేపింది. మైసూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో వాకింగ్ కోసం వెళ్లిన 82 ఏళ్ల ఆర్‌ఎన్ కులకర్ణిని దుండగులు కారుతో ఢీకొట్టి చంపడం అందరిని షాక్‌కు గురి చేసింది. తొలుత కులకర్ణి యాక్సిడెంట్‌లో చనిపోయినట్టు అందరూ భావించారు. కానీ, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోవచ్చాయి. దుండగులు కావాలనే.. అతన్ని చంపినట్లు నిర్ధారించారు. క్యాంపస్‌లో వాకింగ్ చేస్తున్న కులకర్ణిని ఎదురు నుంచి స్పీడ్‌గా వచ్చిన కారు ఢీకొట్టింది. కావాలనే కారుతో ఢీకొట్టి కులకర్ణిని హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రోడ్డుపై యాక్సిడెంట్ చేసిన వాహనం తప్ప ఇంకో వాహనం కన్పించలేదు. కర్ణాటక వీవీ పురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పోలీసులు తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన తరువాత దీనిని మర్డర్ కేసుగా మార్చారు.
కులకర్ణిని ఢీకొట్టిన కారుకు నెంబర్ ప్లేట్ లేదు. ప్రమాదం తరువాత ఆ కారు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం ఐబీ నుంచి రిటైర్ అయ్యారు కులకర్ణి. ఆయన స్వస్థలం హవేరి. 1963లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు కులకర్ణి. 30 ఏళ్ల పాటు ఆయన ఐబీలో సేవలందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన పలు పుస్తకాలు సైతం రచించారు.
కులకర్ణి హత్యపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రదీప్ గుంటి తెలిపారు. జయలక్ష్మీపురం పోలీసులు హత్య కేసు నమోదు చేశారని.. దర్యాప్తును వేగవంతం చేశామని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..