ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ కి మంగళవారం మరో సెలబ్రేషన్ రోజయింది. ఓ వైపు పార్టీ విజయకేతనం వైపు దూసుకుపోతుండగా.. మరో వైపు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా కావడంతో ఆ కుటుంబంతో బాటు పార్టీ నేతలు కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్నంటాయి. సునీత 54 వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో.. అనేకమంది ట్విటర్ల ద్వారా ఆమెకు గ్రీటింగ్స్ తెలిపారు.
కేజ్రీ రాజకీయాల్లోకి రాక ముందు ఈ భార్యాభర్తలిద్దరూ ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారులు. గతవారం ఎన్నికల ఓటింగ్ రోజున ఓ పోలింగ్ కేంద్రం బయట తమ కుటుంబంతో దిగిన ఫోటోను సునీత పోస్ట్ చేశారు. ఎన్నికల్లో తన భర్త తరఫున ఆమె విస్తృత ప్రచారం చేశారు. కేజ్రీని బీజేపీ మంత్రులు, నేతలు టెర్రరిస్ట్ అని ఆరోపించారని, అయితే ఈ ఎన్నికల్లో వారికి ఓటర్లు గట్టి బుధ్ది చెప్పారని ఆమె అన్నారు.’ మాకు వివాహమై పాతికేళ్ళు గడిచాయి. కానీ ఇప్పటికీ సమాజ సేవే తన లక్ష్యమని కేజ్రీవాల్ అంటుంటారు. ఆయనపై ఆరోపణలు చేస్తున్నవారికి తాము అబధ్ధం చెబుతున్నామన్న విషయం తెలుసు. అయితే ఎవరి ఒత్తిడితోనో వారు ఇలా మాట్లాడుతుండ వచ్చు’ అని కూడా సునీత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ మూడోసారి హ్యాట్రిక్ కొడుతుండడంతో ఈ పార్టీ కార్యాలయమంతా కార్యకర్తల కోలాహలంతో నిండిపోయింది. కార్యకర్తలు బాణా సంచా కాల్చరాదని కేజ్రీవాల్ సూచించడంతో వారంతా రంగురంగుల బెలూన్లు మాత్రం ఎగురవేసి ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు.