Visakha Steel: ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు పోరాటం.. బయలుదేరిన నేతలు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ..!
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణపై ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్యమం మరింత ముదురుతోంది. ఇక ఢిల్లీ..
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణపై ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్యమం మరింత ముదురుతోంది. ఇక ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు పోరాటం కొనసాగనుంది. బుధవారమే ఢిల్లీకి బయలుదేరిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక సంఘాల నేతలు పోరాటం కొనసాగించనున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తమ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరనున్నారు కార్మిక సంఘాల నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉక్కు పరిరక్షణ కమిటీ ధర్నాకు దిగనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక, ప్రజా సంఘాల JAC రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. నేటికీ 161వ రోజుకు చేరుకున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక ప్రజా సంఘాల జేఏసీ రిలే నిరహారదీక్షలు 112వ రోజుకు చేరుకున్నాయి. ఇకపై తమ ఉద్యమం మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రజా సంఘాలు, కార్మికు ప్రజా సంఘాల జేఏసీ తెలిపింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు చేస్తున్న పోరాటం రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంతో, కేంద్రం చర్యలను నిరసిస్తూ విశాఖలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ ఉద్యమ సెగలు ఢిల్లీకి తాకనున్నాయి.