Honor Killing: ప్రేమించిందని కన్న కూతురిని చంపిన తండ్రి.. ఏంఎరగనట్టు ‘కరెంట్‌ షాక్‌’ నాటకం

|

Mar 27, 2023 | 11:36 AM

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఆ తండ్రి తన చేతులతో తానే చంపుకున్నాడు. ఓ యువకుడిని ప్రేమించి, పరువ తక్కువ పని చేసిందనే నెపంతో కన్నపేగు బంధాన్ని కాదనుకున్నాడు. కుమార్తెను చంపి, కారెంట్‌ షాక్‌తో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి..

Honor Killing: ప్రేమించిందని కన్న కూతురిని చంపిన తండ్రి.. ఏంఎరగనట్టు ‘కరెంట్‌ షాక్‌ నాటకం
Honor Killing
Follow us on

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఆ తండ్రి తన చేతులతో తానే చంపుకున్నాడు. ఓ యువకుడిని ప్రేమించి, పరువ తక్కువ పని చేసిందనే నెపంతో కన్నపేగు బంధాన్ని కాదనుకున్నాడు. కుమార్తెను చంపి, కారెంట్‌ షాక్‌తో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అంత్యక్రియలు కూడా పూర్తి చేసి చేతులు దులుపుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా కర్చన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

కర్చన సమీపంలోని హిందూబేలా గ్రామానికి చెందిన లల్లన్‌కు ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయం చేసుకుంటూ లల్లన్‌ కుటుంబాన్ని పోషించేవాడు. పెద్దకుమార్తె చాందినీ (19), చిన్న కుమార్తె ఆసియా (15). గతకొంతకాలంగా చాందినీ ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతనితో కలిసి రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెదికి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఇరవై రోజుల క్రితం చాందినీ తన చెల్లి ఆసియాతో కలిసి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ముంబయిలో ఉన్నట్లు తెలుసుకొన్న పోలీసులు, ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో చాందినీ ఓ యువకుడిని ప్రేమించిందని, అందువల్లనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తండ్రికి తెలిసింది.

దీంతో గత శుక్రవారం (మార్చి 24) ఆమెను గదిలో బంధించి విచక్షణారహితంగా కొట్టడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నకుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు. కరెంట్‌ షాక్‌ సోకి చాందినీ చనిపోయిందని తండ్రి గ్రామస్థులను నమ్మించాడు. అనంతరం శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అక్క మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా తన తండ్రే చాందినీని చంపినట్లు గ్రామస్థులకు తెల్పింది. యడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లల్లన్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా పరువు హత్య విషయం బయటపడింది. పోలీసులు సమాధి తవ్వి చాందిని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు యమునానగర్ డీసీపీ సంతోష్ కుమార్ మీనా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.