మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఒమర్ అవుతారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ప్రజలు తమ తీర్పునిచ్చారని.. ఆగస్టు 5న (ఆర్టికల్ 370 రద్దు) తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని నిరూపించారని.. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గందర్‌బల్ అనే రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒమర్ బుద్గామ్ స్థానానికి 18,485 ఓట్ల తేడాతో గెలుపొందగా, 15 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి గందర్‌బల్‌లో 9,766 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. మొదట్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు చూపించిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ఎగ్జిట్ పోల్స్‌పై సెటైర్ వేశారు.
ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేసిందని, అందుకే తాను వాటిని టైమ్ వేస్ట్ అని చెబుతూ ఉంటానని ట్వీట్ చేశారు. ఒక దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని హైలైట్ చేస్తూ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 90 స్థానాలకు గానూ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, సగం మార్కును సునాయాసంగా అధిగమించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కించుకోవచ్చని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.