అమ్మకానికి రైతు అవయవాలు! కిడ్నీలు, కాలేయం, కళ్లు.. ప్రతిదానికి ఒక ధర!

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ రైతు తన కిడ్నీలు, కాలేయం, కళ్ళు అమ్ముకుంటానని బోర్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది. లక్ష రూపాయల రుణ భారం కారణంగా ఈ అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఆత్మహత్య బెదిరింపులు చేస్తున్నాడు.

అమ్మకానికి రైతు అవయవాలు! కిడ్నీలు, కాలేయం, కళ్లు.. ప్రతిదానికి ఒక ధర!
Organs For Sale

Updated on: Apr 02, 2025 | 5:47 PM

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. తన కిడ్నీలు, కాలేయం, కళ్లు అమ్ముతానంటూ ఓ రైతు బోర్డు పట్టుకొని రోడ్డుపై నిల్చున్నాడు. ఇది చూసి స్థానికులు షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఐడోల్ అనే రైతు “రైతుల అవయవాలను కొనండి” అని రాసి ఉన్న బోర్డును పట్టుకుని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలోకి నడుస్తున్నట్లు నిరసన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతులు దుస్థితికి ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది.

అతని బోర్డులో కిడ్నీల ధర రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్ళు రూ.25,000 అని రాసి ఉంది. రైతు ఆ బోర్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం అక్కడున్న వారిని ఆలోచింపజేసింది. చాలా మంది ఆ రైతు బోర్డును చదివేందుకు అక్కడే నిల్చుండిపోయారు. తన లక్ష రూపాయల అప్పును తిరిగి చెల్లించలేక, తన భార్య, పిల్లల అవయవాలకు కూడా ధర నిర్ణయించినట్లు రైతు ఐడోల్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రైతు ఐడోల్.. మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రుణ మాఫీ హామీని ఉల్లంఘించారని ఆరోపించారు.

“ఎన్నికలకు ముందు, రుణమాఫీ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ, గెలిచాక మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మన దగ్గర ఏమీ లేనప్పుడు రుణాలు ఎలా తిరిగి చెల్లించగలం?” అని ఐడోల్‌ అన్నారు. కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న ఐడోల్ మహారాష్ట్ర బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారు. కానీ పంట రాబడి సరిగా లేకపోవడంతో దానిని తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడ్డారు. ఆత్మహత్య తనకు ఏకైక మార్గంగా అనిపిస్తోందని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ ఒక వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.