ఇంటి ముందున్న కొబ్బరి చెట్టే చిన్నారి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా ప్రజలను షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. హవేరి జిల్లాలోని హన్సభవి గ్రామానికి చెందిన మల్లిఖార్జున, మాలా దంపతులకు 11 నెలల వయసున్న బాలుడు ఉన్నాడు. ఈ చిన్నారి పేరు తన్విత్ వాల్మీక్. వాల్మీక్‌ను ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిడ్డకు స్నానం చేయించి ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు కింద మంచం వేసి పడుకోబెట్టింది తల్లి. చిన్నోడు నిద్రపోవడంతో ఇంట్లో పనుల్లో బిజీ అయిపోయింది. మల్లిఖార్జున కూడా తన పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత మేల్కొన్న తన్విత్ అక్కడే ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కొబ్బరి చెట్టు నుంచి బోండాం రాలి వాల్మీక్‌పై పడింది. అది తలపై పడటంతో పెద్ద గాయమైంది. క్షణాల్లోనే తీవ్రంగా రక్తస్రావమైంది. బాబు ఏడుపు విన్న తల్లి ఇంట్లో నుంచి హుటాహుటిన పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. రక్తంతో తడిసిన వాల్మీక్‌ను చూసి ఒక్కసారిగా షాకైంది. పక్కనే బోండాం కనిపించడంతో.. బోండాం వల్లే తలకు గాయమైందని తెలిసి తల్లడిల్లిపోయింది.
ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు గుమిగూడారు. వెంటనే పిల్లాడిని దావణగెరెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పిల్లాడు అక్కడికి వెళ్లేలోగా చనిపోయాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న బిడ్డ 11 నెలలకే దూరమవ్వడంతో మాలా, మల్లిఖార్జున దంపతులు గుండెలు పగిలేలా రోదించారు. ఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: కత్తి మహేష్‌కు చికిత్స నిమిత్తం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం.. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే
వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో తెరపైకి కొత్త వ్యక్తులు.. అసలు కృష్ణయ్య యాదవ్ ఎవరంటే..?