Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?

|

Mar 17, 2022 | 4:02 PM

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి.

Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?
Petrol Diesel Price
Follow us on

Petrol Diesel Price: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగానే కేంద్ర ప్రభుత్వం జోక్యంతో పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు పెంచకుండా ప్రజలకు ఊరట లభించిందన్న ప్రచారం చాలా రోజుల నుంచే జరుగుతోంది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి.  హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడం తెలిసిందే.

రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్‌ను భారత్‌కు ఇస్తే.. దేశంలో పెట్రోధరలు తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనావేస్తున్నారు.  ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారీ తగ్గింపుతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్‌ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. బ్యారెల్‌కు $ 20 నుండి 25 వరకు తగ్గింపుతో IOC ‘యురల్స్ క్రూడ్’ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే కొన్ని షరతులతో ముడిచమురును ఐవోసీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించిన తర్వాత, చమురు మరియు ఇతర వస్తువులను భారతదేశం లాంటి ఇతర పెద్ద దిగుమతిదారులకు సబ్సిడీ ధరలకు అందించడం రష్యా ప్రారంభించింది. తన సొంత నిబంధనల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును ఐఓసీ కొనుగోలు చేసింది.

దిగుమతుల ద్వారా 85 శాతం ముడి చమురు అవసరాలను భారత్ తీర్చుకుంటోంది. తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా ఇంధన బిల్లును తగ్గించుకోవాలనుకుంటోంది భారత్ . ఇంధనం కొనుగోలు చేసేందుకు అవసరమైన బీమా, సరుకు రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సబ్సిడీ ధరలకు ముడిచమురును విక్రయించాలన్న రష్యా ప్రతిపాదనను దేశం మూల్యాంకనం చేస్తుందని సోమవారం రాజ్యసభకు తెలిపారు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ .
రష్యా నుండి భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 1.3 శాతం మాత్రమే కొనుగోలు చేస్తోంది. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని కొద్దిరోజుల క్రితమే రష్యా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌పై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నా.. ఎంత మేరకు తగ్గే అవకాశముందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. గత రెండు, మూడు మాసాలుగానే క్రూడాయిల్ ధరలు పెరిగినా.. పెట్రో ధరలను పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఈ నష్టాలు కాస్తైనా భర్తీ అయ్యాకే పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read..

Tata UPI Payments: టాటా నుంచి యూపీఐ పేమెంట్ యాప్‌.. ఎన్‌పీసీఐ క్లియరెన్స్ కోరుతూ దరఖాస్తు..!

Kunool Jail: ఖిలాడీ ఖైదీ.. ఐదు రోజుల్లో రెండు సార్లు తప్పించుకున్నాడు.. అధికారులు ఏం చేశారంటే