Ex-fire Officer: చదివింది టెన్త్‌.. ఫేక్‌ డిగ్రీతో 30 ఏళ్లపాటు అగ్నిమాపక శాఖలో ఉద్యోగం.. అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చిన కింది ఉద్యోగి

|

Feb 17, 2023 | 6:48 PM

చదివింది పదో తరగతి.. పత్రాల్లో మాత్రం డిగ్రీ చదివినట్లు అందరినీ నమ్మించాడు. ఆనక నకిలీ డిగ్రీ పట్టుకొచ్చి ఏకంగా 30 ఏళ్లపాటు గెజిటెడ్‌ అధికారికగా ప్రభుత్వ ఉద్యోగంలో చలామణయ్యాడో ప్రబుద్ధుడు..

Ex-fire Officer: చదివింది టెన్త్‌.. ఫేక్‌ డిగ్రీతో 30 ఏళ్లపాటు అగ్నిమాపక శాఖలో ఉద్యోగం.. అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చిన కింది ఉద్యోగి
Ex Fire Officer
Follow us on

చదివింది పదో తరగతి.. పత్రాల్లో మాత్రం డిగ్రీ చదివినట్లు అందరినీ నమ్మించాడు. ఆనక నకిలీ డిగ్రీ పట్టుకొచ్చి ఏకంగా 30 ఏళ్లపాటు గెజిటెడ్‌ అధికారికగా ప్రభుత్వ ఉద్యోగంలో చలామణయ్యాడో ప్రబుద్ధుడు. ఈ కేసులో సదరు ఉద్యోగికి నాలుగేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ స్థానిక కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 17) తీర్పు వెలవరించింది. మధ్యప్రదేశ్ అగ్నిమాపక శాఖ మాజీ చీఫ్ సూపరింటెండెంట్‌ అయిన బీఎస్ టోంగర్ (70) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఐతే డిగ్రీ చదివినట్లు ఫేక్‌ సర్టిఫికెట్‌ను సృష్టించి ఆగ్నిమాపక శాఖలో గెజిట్‌ అధికారిగా ఉద్యోగంలో చేరి చీఫ్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశాడు. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.12 వేలు జరిమానా కూడా విధించినట్లు ఇండోర్‌లోని స్థానిక కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తెలిపారు. భారత శిక్షాస్మృతి ప్రకారం అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం టోంగర్‌ను కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు.

ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు టోంగర్‌పై ఎకనామిక్స్‌ ఆఫీసర్స్ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఢిల్లీ ప్రభుత్వ విద్యుత్ సరఫరా యూనిట్‌లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)గా నియమితులైన టోంగర్ డిప్యూటేషన్‌పై మధ్యప్రదేశ్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యారు. ఐతే టోంగర్‌ తన పాత సర్వీస్‌ రికార్డుల్లోని వివరాలను తారుమారు చేసి నాగ్‌పూర్‌లోని ఓ కాలేజ్‌ పేరుతో ఇంజనీరింగ్‌ పూర్తి చేసినట్లు ఫేక్‌ డిగ్రీని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించాడు. సదరు డిగ్రీ ఆధారంతో ఇండోర్‌లోని ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ సూపరింటెండెంట్‌గా గెజిటెడ్ అధికారి హోదాలో పోస్టింగ్‌ పొందాడు. ఈ విధంగా దాదాపు 30 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత 2013లో టోంగర్‌ రిటైర్డ్‌ అయ్యాడు. టోంగర్‌ భాగోతం బయపడటంతో అదే ఏడాది అతనిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో టోంగర్‌పై వచ్చిన అభియోగాలను రుజువు చేసేందుకు ప్రాసిక్యూటర్‌ 30 మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన అతన్ని ఆ పదవికి అనర్హుడిగా కోర్టు తాజాగా నిర్ధారించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.